స్వయం ఉపాధితో పదిమందికీ ఉపాధి చూపండి
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో మరో పదిమందికి ఉపాధి చూపేవిధంగా ఎదగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. లీప్ సంస్థ ట్రైనీ మేనేజర్ డాక్టర్ పీవీ రామరాయలు ఆధ్వర్యంలో ‘ఇంక్యుబేషన్ సెంటర్’పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువును కాపాడినట్టుగానే.. విద్యార్థులు మంచి వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ దోహదపడుతుందన్నారు. వ్యాపార, పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు, అందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి ఏవిధంగా పొందవచ్చననే విషయాలపై సంస్థ తోడ్పాటునందిస్తుందన్నారు. స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెడితే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ కేఎస్ రమేష్, డీన్ డాక్టర్ ఎస్.టేకి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సురేష్‌బాబు, డాక్టర్ మట్టారెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.