లీకేజీ.. డ్యామేజీ..!
దేవరకద్ర రూరల్ : ప్రధాన సాగు, తాగునీటి వనరు కోయిల్‌సాగర్ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. దశాబ్ధాల తరబడి ప్రాజెక్టుకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో క్రమంగా శిథిలస్థితికి చేరుతోంది. పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు గేట్ల రబ్బర్‌వాచర్లు అరిగిపోవడంతో నీరంతా లీకేజీల రూపంలో వృథాగా పోతోంది. వందలకోట్లు వెచ్చించి ప్రాజెక్టు నింపుతున్న అధికారులు నాణ్యతపై దృష్టిసారించడం లేదు. అలుగుపై 1981లో ఏర్పాటుచేసిన క్రస్ట్‌గే ట్ల షట్టర్లకు ఇప్పటివరకూ మరమ్మతులు చేపట్టలేదు.
దీంతో షట్టర్ల కింద నీరంతా లీకేజీ అవుతుంది. పాత అలుగు స్థాయి 26.6 అడుగులకు నీరు చేరగానే లీకేజీలు ప్రారంభమవుతున్నాయి. కోయిల్‌సాగర్ అలుగుపై పిచ్చిమొక్కలు తొలగించడం లేదు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం రాయి సున్నంతో నిర్మించిన అలుగుకు కనీసం మరమ్మతులు చేపట్టకుండానే ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టును నింపుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల పెద్దవాగు ద్వారా నీటి ప్రవాహం లేకపోవడంతో ఎత్తిపోతల ద్వారానే నీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టు రెండువైపులా ఉన్న ఆనకట్టపై సీసీ పనులు కూడా చేయకుండానే వదిలేశారు.
ధన్వాడ, కోయిల్‌కొండ మండలాలకు వెళ్లేందుకు ప్రాజెక్టు అలుగు కింద ఏర్పాటుచేసిన రోడ్డు పూర్తి అధ్వానంగా మారింది. ప్రస్తుతం నీటి లీకేజీల వల్ల రోడ్డంతా నీటిలో మునిగిపోయింది. రెండు దశాబ్దాల క్రితం రోడ్డు వేసిన తరువాత మళ్లీ రోడ్డు గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాజెక్టు కింద సీసీరోడ్డు నిర్మాణం చేపడితేనే గాని రాకపోకలకు సౌకర్యవంతంగా ఉండదు.
ఆరు దశాబ్దాల క్రితం
నిజాం నవాబు పాలనలో కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఎనిమిదేళ్లలో నిర్మించారు. రూ.85 లక్షల వ్యయంతో 1947లో పనులు ప్రారంభించి 1955లో ప్రాజెక్టు పనులు పూర్తిచేశారు. వందశాతం రాయి, సున్నంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు ఆనకట్టను మరమ్మతులు చేయడంతో పాటు కట్ట ఎత్తు పెంచడానికి అలుగుపై రూ.92లక్షల వ్యయంతో క్రస్టుగేట్లను 1981లో ఏర్పాటుచేశారు.
నాటినుంచి ప్రాజెక్టు వద్ద ఎలాంటి పనులు చేపట్టలేదు. ఇటీవల ఎత్తిపోతల పథకంలో భాగంగా కాల్వలను వెడల్పుచేసే పనులు కొత్తకాల్వల పొడగింపు పనులు మాత్రమే చేశారు. గతంలో ఆయకట్టు భూములు 12వేల ఎకరాల మేరకు ఉన్నప్పుడు చిన్న మధ్యతరహా నీటిపారుదల శాఖ కింద ప్రాజెక్టు ఉండేది. ప్రస్తుతం ఎత్తిపోతల వల్ల ఆయకట్టు 50,250 ఎకరాలకు పెరగనుండడంతో భారీ నీటిపారుదల శాఖ పరిధిలోకి చేరింది.
గెస్ట్‌హౌస్‌లు మరీ అధ్వానం..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చే అధికారుల విడిది కోసం ఏర్పాటు చేసిన గెస్ట్‌హౌస్‌ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో భూత్‌బంగ్లాలను తలపిస్తున్నాయి. ఇక్కడ పనిచేసే గ్యాంగ్మెన్లు కూడా కనీసం వాటిన శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించడం లేదు.
ఎప్పుడైనా అధికారులు, నాయకులు వస్తున్నారంటే హడావుడి చేయడం తప్ప మళ్లీ జోలికి వెళ్లిన దాఖలాల్లేవు. ప్రాజెక్టు శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టుకు మరమ్మతు చేపడితే నాలుగుకాలాల పాటు ఉంటుంది. లేదంటే నిష్ర్పయోజనమే!