Recruitment of doctors
-
ఆరోగ్య శాఖకు జవసత్వాలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పుడు కొత్త సందడి నెలకొంది. గత ప్రభుత్వం ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోవడంతో దారుణ పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఆస్పత్రులు ప్రస్తుతం కొత్త రూపును సంతరించుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్చిన సంగతి తెలిసిందే. ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నీ కొత్త జవసత్వాలు సంతరించుకున్నాయి. ఇన్నాళ్లూ స్పెషలిస్టు డాక్టర్లు లేక కునారిల్లిన బోధనాస్పత్రులు ఇప్పుడు ఒక్కసారిగా 582 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల చేరికతో కళకళలాడుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఇప్పటికే 592 మంది వైద్యులు చేరారు. దీంతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇద్దరు డాక్టర్లతో పనిచేస్తున్నాయి. ఫలితంగా పేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇదే అతిపెద్ద నియామక ప్రక్రియ - రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇదే అతిపెద్ద నియామక ప్రక్రియ - ఒకేసారి 2,094 పోస్టుల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికే విధుల్లో 1,368 మంది చేరిక. మిగిలిన పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగింపు - జిల్లా స్థాయిలో మెడికల్, పారామెడికల్ తదితరాలకు సంబంధించి 7,838 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తి. వీరిలో ఇప్పటివరకు విధుల్లో చేరినవారు 4,979 మంది. - నేషనల్ హెల్త్‌మిషన్ ద్వారా మరో 2,919 పోస్టులకు కొనసాగుతున్న నియామక ప్రక్రియ - రాష్ట్రంలో 30 శాతం వరకు మానవవనరులు పెరిగినట్టు అంచనా వైద్యుల నియామకాలు.. విభాగం మంజూరైన పోస్టులు ఇప్పటివరకు నియామకాలు వైద్య విద్యా శాఖ 737 582 వైద్య విధాన పరిషత్ 692 194 ప్రజారోగ్య శాఖ 665 592 జిల్లాల వారీగా.. వైద్య విద్యా శాఖ 3,680 1,866 వైద్య విధాన పరిషత్ 1,678 1,161 ప్రజారోగ్య శాఖ 2,480 1,952 నేషనల్ హెల్త్ మిషన్ 2,919 ప్రక్రియ కొనసాగుతోంది -
దూసుకెళ్తున్న టామ్‌కామ్
తాజాగా గల్ఫ్ దేశాల్లో డాక్టర్ల రిక్రూట్మెంట్కు ఒప్పందం సాక్షి, హైదరాబాద్: విదేశీ ఉద్యోగ కల్పనలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్) దూసుకెళ్తోంది. గల్ఫ్ దేశాలలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాలలో ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. ఇప్పటి వరకు అన్‌స్కిల్డ్ రంగాలకు సంబంధించి దాదాపు 750 మందిని వివిధ కంపెనీల కోసం నియామకాలు చేసి, గల్ఫ్ దేశాలకు పంపిన విషయం తెలిసిందే. అలాగే మరో 156 మంది పారా మెడికల్ సిబ్బంది రిక్రూట్మెంట్కు సంబంధించి కూడా గల్ఫ్ దేశాలలోని ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. తాజాగా కొన్ని విభాగాలలో డాక్టర్ల నియామకాలు కూడా చేయడానికి టామ్కామ్కు అనుమతి లభించింది. మొదటి విడుతలో భాగంగా సౌదీఅరేబియాలో పనిచేయడానికి 12 డాక్టర్ పోస్టులకు నియామకాలు జరపనున్నారు. ప్రారంభ వేతనం భారత కరెన్సీ ప్రకారం నెలకు రూ.6 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు ఉంటుంది. అయితే రెండేళ్ల పాటు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఏడాదికి నెల రోజుల పాటు సెలవులు. విమాన చార్జీలు, సౌదీలో రవాణా, మెడికల్ సదుపాయం సంబంధిత కంపెనీయే భరిస్తుంది. ఆసక్తిగల వారు ఆన్లైన్ ద్వారా ఈ నెల 13 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా టామ్‌కామ్ డెరైక్టర్ కె.వై.నాయక్ తెలిపారు. డాక్టర్ల నియామకానికి సంబంధించి కార్డియాలజిస్ట్(2), ఈఎన్టీ(2), పిడియాట్రిక్ (2), గైనకాలజిస్ట్(మహిళ) (2), డెర్మటాలజిస్ట్(2), న్యూరోసర్జరీ స్పెషలిస్ట్(1) విభాగాల్లో ఖాళీలున్నాయి. పారామెడికల్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు పారామెడికల్ సిబ్బంది నియామకాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 5 నుంచి 13కు పొడిగించినట్టు నాయక్ చెప్పారు. గల్ఫ్ దేశాలలో వివిధ విభాగాలల్లో దాదాపు 156 మంది పారామెడికల్ సిబ్బంది నియమకాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 156 పోస్టులకు గాను దాదాపు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఎంప్లాయిమెంట్ కార్డు గడువు ముగిసిన వారు రెన్యూవల్ చేసుకోవడానికి డెరైక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అవకాశం కల్పించింది. వీరందరూ జిల్లాలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రెన్యూవల్ చేసుకోవచ్చని నాయక్ చెప్పారు.