పెరిగిన భూముల విలువ
– జూలై చివరి వారంలో రిజిస్ట్రేషన్ల జోరు
– ‘అష్టమి’, సర్వర్ దెబ్బకు చివరి రోజు డీలా
అనంతపురం టౌన్: జిల్లాలో పెరిగిన భూముల విలువ అమల్లోకి వచ్చింది. అయితే తొలిరోజు మంగళవారం రిజిస్ట్రేషన్లు నామమాత్రంగా జరిగాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి భూముల విలువ పెరుగుతాయన్న సమాచారంతో చివరి వారంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడగా.. ఆఖరి రోజు సోమవారం మధ్యాహ్నం నుంచి ‘అష్టమి’ దెబ్బకు రిజిస్ర్టేషన్లు అంతగా జరగలేదు. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యం 45 నుంచి 50 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ఆగస్టు చివరి వారంలో రోజూ 100 వరకు జరిగాయి. అయితే సోమవారం మాత్రం 60కి తగ్గాయి. ఇదే సమయంలో రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో మాత్రం 100 వరకు జరగడం గమనార్హం. మొత్తంగా చివరి రోజు కన్నా అంతకుముందు ఐదు రోజుల్లో అనంతపురం రిజిస్ట్రార్ పరిధిలోని కార్యాలయాల్లో ఏకంగా 1,200 వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. హిందూపురం రిజిస్ట్రార్ పరిధిలోని కార్యాలయాల్లో సర్వర్ లోపంతో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగాయి.
20 శాతం పెరిగిన భూముల విలువ
అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలోని 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని భూముల విలువ 20 శాతం వరకు పెరిగింది. మునిసిపాలిటీలు, నగర పంచాయతీలో గరిష్టంగా 20 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 శాతం ఉంది. భూముల విలువ పెరుగుదల మంగళవారం నుంచే ఈ అమల్లోకి వచ్చింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు ఇప్పటికే రాగా జూలైలో మాత్రమే జరిగే రిజిస్ట్రేషన్ల వివరాలను డీఐజీ కార్యాలయ అధికారులు సేకరిస్తున్నారు.