స్టెతస్కోప్ @200 ఏళ్లు
డాక్టర్ హస్తభూషణం స్టెతస్కోప్.. డాక్టర్ పేరు వినగానే కళ్ల ముందు కదలాడేదీ స్టెతస్కోప్.. డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందు పరీక్షించేదీ ఈ స్టెతస్కోప్‌తోనే.. మనందరితో ఎంతో అనుబంధం ఉన్న ఈ స్టెతస్కోప్ చరిత్ర ఇప్పటిది కాదు 200 ఏళ్ల నాటిది. దీన్ని 1816 జనవరి 12న తొలిసారిగా ఉపయోగించారు. ఫ్రెంచ్ వైద్యుడైన రీన్ థియోఫిల్లే హయాసింథే లెన్నెక్ దీన్ని తయారు చేశారు.
అప్పటిదాకా హృదయ స్పందనలు తెలుసుకోవాలంటే డాక్టర్ నేరుగా తన చెవిని రోగి ఛాతీపై ఉంచి వినేవారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఓ యువతి లెన్నెక్ దగ్గరికి రాగా, ఆమె ఛాతీపై తల పెట్టేందుకు ఇబ్బంది పడ్డారట. ఈ సంఘటనతో స్టెతస్కోప్ రూపకల్పన చేశారు. ఎన్ని రకాల కొత్త టెక్నాలజీలు వచ్చినా ఇప్పుడు డాక్టర్ చేతిలో స్టెతస్కోప్ ఉండాల్సిందే.
1816..
పారిస్‌లో లెన్నెక్ కనుగొన్నారు. పిల్లనగ్రోవి మాది రిగా ఉండే ఓ కర్ర గొట్టం ద్వారా ఒకే చెవితో గుండె చప్పుడు వినేవారు.
1851
ఆర్థర్ లేర్డ్ అనే ఐరిస్‌కు చెందిన వైద్యుడు 1851లో రెండు చెవుల ద్వారా వినగలిగే స్టెతస్కోప్ తయారు చేశారు. అయితే 1852లో జార్జ్ కామన్ అనే వైద్యుడు దీన్ని మరింతగా మెరుగుపరిచి, ఈ డిజైన్‌ను వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించారు.
1873
ఈ కాలంలో స్టెతస్కోప్లలో అనేక మార్పులు జరిగాయి. అయితే ఇవి క్లినికల్ ప్రాక్టీస్‌లో ప్రాచుర్యంలోకి రాలేదు.
1840..
గోల్డింగ్ బర్డ్ అనే వైద్యుడు వంచేందుకు వీలుండే గొట్టంతో స్టెత్‌ను తయారు చేశారు. దీని సహాయంతో కూడా ఒకే చెవి ద్వారా వినొచ్చు.
1940
తొలి స్టెత్ తయారైన దాదాపు దశాబ్దం తర్వాత రెండు రకాల స్టెతస్కోప్‌లు అభివృద్ధి చెందాయి. ఒకటి శ్వాస వ్యవస్థను తెలుసుకునేందుకు కాగా, రెండోది హృదయ స్పందనలకు సంబంధించింది. ఈ స్టెతస్కోప్ రాను రాను అనేక మార్పులు చెంది ఇప్పుడు మనం చూస్తున్న స్టెత్ రూపుదిద్దుకుంది.