అన్ని కష్టాలూ అధిగమించి...
‘‘సినిమా కష్టాలంటారు కదా. ఈ సినిమాకి నిజంగానే సినిమా కష్టాలొచ్చాయి. అన్ని కష్టాలనూ అధిగమించి విడుదల కాబోతోంది’’ అని ‘దిల్’ రాజు చెప్పారు. నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై దేవా కట్టా దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఆటోనగర్ సూర్య’. ఈ 27న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో ‘దిల్’ రాజు విడుదల చేయనున్నారు. దేవా కట్టా మాట్లాడుతూ - ‘‘చైతూలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది. పరిపూర్ణమైన నటుడు అని ప్రేక్షకులు కచ్చితంగా ప్రశంసిస్తారు. అలాగే, దర్శకునిగా నా కెరీర్‌కి కూడా ఉపయోగపడే చిత్రమిది.
మేమంతా కలిసి ఓ మంచి సినిమా చేయడానికి శాయశక్తులా కృషి చేశాం. వాణిజ్యపరంగా ఏ స్థాయి సినిమా అవుతుందనేది మొదటి ఆటకే తెలిసిపోతుంది’’ అన్నారు. అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ‘‘ఓ సరికొత్త కథాంశంతో తీసిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఎంతగా ప్రయత్నించినా మావల్ల కాలేదు. చివరికి అలంకార్ ప్రసాద్, ఉషా పిక్చర్స్ బాలకృష్ణారావులాంటివారిని సంప్రదించాం. మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ‘మనం’తో ప్రతి ఇంటికీ దగ్గరయ్యాడు చైతన్య. ఈ చిత్రంలో తన పాత్ర కన్నులపండువగా ఉంటుంది’’ అని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పంపిణీదారులు అలంకార్ ప్రసాద్, సుదర్శన్ పాల్గొన్నారు.