Relieving Letters
-
మేం వెళ్లిపోతున్నాం..
చింతూరు(తూర్పుగోదావరి జిల్లా): రాష్ర్ట విభజన అనంతరం తెలంగాణకు సర్దుబాటు అయి, తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పనిచేస్తున్న టీచర్లు మంగళవారం స్వచ్ఛందంగా రిలీవ్ లేఖలిచ్చారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు తమను రిలీవ్ చేయాలని వారు కొంతకాలం నుంచి ఆంధ్రా అధికారులను కోరుతున్నారు. గత విద్యా సంవత్సరం ముగియడానికి ముందు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా తమను రిలీవ్ చేయాలని వారు ఆంధ్రా డీఈఓలకు విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యోగులను తమ రాష్ట్రానికి పంపాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సైతం విలీన మండలాల అధికారులకు లేఖలు రాశారు. తమకు రాష్ట్రస్థాయి నుంచి ఆదేశాలు రావాలని ఇక్కడి అధికారులు చెప్పడంతో తెలంగాణ ఉపాధ్యాయులు నిరాహార దీక్షలకు దిగారు. తమను ఆంధ్రా అధికారులు రిలీవ్ చేయడం లేదని, దీనిపై తెలంగాణ అధికారులే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విలీన మండలాల్లోని తెలంగాణ ఉపాధ్యాయులంతా సోమవారం ఖమ్మం కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల ముట్టడి చేపట్టారు. అనంతరం వారంతా మంగళవారం తమ ఎంఈఓ కార్యాలయాలకు చేరుకుని మూకుమ్మడిగా స్వచ్ఛంద రిలీవ్ లేఖలు ఇచ్చి తెలంగాణకు వెళ్లిపోయారు. ఇప్పటికే చింతూరు మండలంలో ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తెలంగాణకు వెళ్లిపోగా.. తాజాగా జిల్లా పరిషత్‌కు చెందిన 11 మంది, ఎంపీపీ, ఎంపీయూపీ పాఠశాలలకు చెందిన 43 మంది స్వచ్ఛంద రిలీవ్ లేఖలిచ్చి వెళ్లిపోయారు. నెల్లిపాక మండలంలో 138 మంది, వీఆర్ పురం మండలంలో 48 మంది, కూనవరం మండలంలో 33 మంది కలిపి మొత్తంగా 273 మంది ఈవిధంగా లేఖలు ఇచ్చి తెలంగాణకు వెళ్లిపోయారు. తెలంగాణ ఉపాధ్యాయులు వెళ్లిపోవడంతో చింతూరు మండలంలోని 24 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ టీచర్ల స్వచ్ఛంద రిలీవ్ లేఖల అంశాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంఈఓ రమణశ్రీ తెలిపారు. దీనిపై విలీన మండలాల ఎంఈఓలతో డీఈఓ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారని, పాఠశాలలు మూతపడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చిస్తామని తెలిపారు. -
హైటెక్ నిందితుల అరెస్ట్
బెంగళూరు : ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో పని చేసినట్లు నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రం (ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్), రిలీవింగ్ లెటర్స్ ఇచ్చి మోసం చేస్తున్న నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి చెప్పారు. వారికి సహకరించిన మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం ఆయనిక్కడ మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. సౌత్ ఎండ్ సర్కిల్‌కు చెందిన కిరణ్‌కుమార్ జయనగర 9వ బ్లాక్‌లోని ఒక ప్రముఖ హోటల్లో ఇన్ఫో మ్యాట్రిక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు. కృష్ణారెడ్డి లేఔట్ నివాసి రంగరాజు, బిస్మిల్లా నగర్ వాసి షేక్ అబ్దుల్ అల్తాజ్ అహమ్మద్, సుల్తాన్‌పాళ్య వాసి బాలరాజుల సాయంతో నిరుద్యోగులను సంప్రదించాడు. ప్రముఖ కంపెనీల పేర్లతో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, శ్యాలరీ సర్టిఫికెట్లు ఇస్తే ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో ఎక్కువ జీతాలు వస్తాయని నమ్మించి, వారి నుంచి భారీగా డబ్బులు రాబట్టాడు. నిరుద్యోగులకు ఐడీ కార్డులు, నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇచ్చాడు. ఇలా సుమారు 20 ప్రముఖ కంపెనీల పేర్లతో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు సీసీబీ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కంప్యూటర్లు, ఐడీ కార్డులు, లెటర్హెడ్లు, 25 ఫోన్లు, సిమ్‌కార్డులు, నకిలీ ఐడీ కార్డులు, రిలీవింగ్ లెటర్హెడ్లు, నకిలీ ఎక్స్పీరియన్స్ లెటర్స్, సీల్లు స్వాధీనం చేసుకున్నారు.