మేం వెళ్లిపోతున్నాం.. | we are going to our state.. allow us | Sakshi
Sakshi News home page

మేం వెళ్లిపోతున్నాం..

Published Tue, Jun 23 2015 9:09 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

we are going to our state.. allow us

చింతూరు(తూర్పుగోదావరి జిల్లా): రాష్ర్ట విభజన అనంతరం తెలంగాణకు సర్దుబాటు అయి, తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పనిచేస్తున్న టీచర్లు మంగళవారం స్వచ్ఛందంగా రిలీవ్ లేఖలిచ్చారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు తమను రిలీవ్ చేయాలని వారు కొంతకాలం నుంచి ఆంధ్రా అధికారులను కోరుతున్నారు. గత విద్యా సంవత్సరం ముగియడానికి ముందు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా తమను రిలీవ్ చేయాలని వారు ఆంధ్రా డీఈఓలకు విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యోగులను తమ రాష్ట్రానికి పంపాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సైతం విలీన మండలాల అధికారులకు లేఖలు రాశారు.

తమకు రాష్ట్రస్థాయి నుంచి ఆదేశాలు రావాలని ఇక్కడి అధికారులు చెప్పడంతో తెలంగాణ ఉపాధ్యాయులు నిరాహార దీక్షలకు దిగారు. తమను ఆంధ్రా అధికారులు రిలీవ్ చేయడం లేదని, దీనిపై తెలంగాణ అధికారులే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విలీన మండలాల్లోని తెలంగాణ ఉపాధ్యాయులంతా సోమవారం ఖమ్మం కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల ముట్టడి చేపట్టారు. అనంతరం వారంతా మంగళవారం తమ ఎంఈఓ కార్యాలయాలకు చేరుకుని మూకుమ్మడిగా స్వచ్ఛంద రిలీవ్ లేఖలు ఇచ్చి తెలంగాణకు వెళ్లిపోయారు. ఇప్పటికే చింతూరు మండలంలో ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తెలంగాణకు వెళ్లిపోగా.. తాజాగా జిల్లా పరిషత్‌కు చెందిన 11 మంది, ఎంపీపీ, ఎంపీయూపీ పాఠశాలలకు చెందిన 43 మంది స్వచ్ఛంద రిలీవ్ లేఖలిచ్చి వెళ్లిపోయారు.

నెల్లిపాక మండలంలో 138 మంది, వీఆర్ పురం మండలంలో 48 మంది, కూనవరం మండలంలో 33 మంది కలిపి మొత్తంగా 273 మంది ఈవిధంగా లేఖలు ఇచ్చి తెలంగాణకు వెళ్లిపోయారు. తెలంగాణ ఉపాధ్యాయులు వెళ్లిపోవడంతో చింతూరు మండలంలోని 24 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ టీచర్ల స్వచ్ఛంద రిలీవ్ లేఖల అంశాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంఈఓ రమణశ్రీ తెలిపారు. దీనిపై విలీన మండలాల ఎంఈఓలతో డీఈఓ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారని, పాఠశాలలు మూతపడకుండా చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చిస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement