విజయవాడలో రాష్ట్ర ప్రధాన వాతావరణ కేంద్రం
రాష్ట్ర వాతావరణ శాఖ డెరైక్టర్ యెరెడ్ల కరుణాకర్‌రెడ్డి
రెంటచింతలలో అత్యాధునిక వాతావరణ నమోదు కేంద్రం ప్రారంభం
రెంటచింతల రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ డెరైక్టర్ యెరెడ్ల కరుణాకర్‌రెడ్డి చెప్పారు. రెంటచింతలలోని తేరేజమ్మ హాస్టల్ ఆవరణలో రూ.ఆరు లక్షలతో ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటుచేసిన వాతావరణ నమోదు కేంద్రాన్ని గురువారం ఫాదర్లు పుట్టి సుందరరాజు, గోవిందు బాలస్వామితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
త్వరలోనే గాలి దిశను తెలిపేయంత్రం ఏర్పాటు
ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడాన్ని 1936లో గమనించిన బ్రిటీష్ వారు వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. గతేడాది మార్చిలో అనివార్య కారణాలతో గురజాలలోని జంగమహేశ్వరపురం వ్యవసాయ క్షేత్రానికి దానిని తరలించినట్లు తెలిపారు. స్థానిక రైతు గోగిరెడ్డి ప్రతాప్‌రెడ్డి చొరవతో ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రం ద్వారా గంటగంటకూ ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమశాతాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు. త్వరలోనే ఇక్కడ గాలి దిశను తెలిపే యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
రైతుల సెల్ ఫోన్లకు సమాచారం
రైతులు పేరు, ఊరి పేరు, సెల్ నంబర్ నమోదుచేసుకుంటే ప్రతి మంగళవారం, శుక్రవారం వాతావరణ వివరాలు మెసేజ్ రూపంలో పంపిస్తామని తెలిపారు. రెంటచింతలలో 2003 మే 28న 49.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, 2004 ఫిబ్రవరి 8న 9.4 అత్యల్ప ఉష్ణోగ్రత, 1964 సెప్టెంబర్ 29న 227మి.మీల అత్యధిక వర్షపాతం నమోదైందని వివరించారు. ఇంజినీర్లు గజేంద్రసింగ్, సంజయ్, మాజీ సర్పంచ్ కటకం శౌరెడ్డి, కట్టమూరి నాగేశ్వరరావు,తుమ్మా లూర్దురెడ్డి,ఏరువప్రతాప్రెడ్డి,తుమ్మా ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.