అద్దెకు ఎద్దు..!
* జత ఎడ్లకు నెలకు రూ.10 వేలు
* కరువులో పశుపోషణ కష్టమవడంతోనే.. అంటున్న రైతులు
బాల్కొండ: ఖరీఫ్‌లో విత్తనాలను విత్తేందుకు అద్దె ఎడ్ల కోసం రైతులు ముందస్తుగానే అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గురువారం జరిగిన పశువుల సంతలో క్రయ విక్రయాలకంటే అద్దె వ్యవహారాలే నడిచాయి. అధిక శాతం రైతులు అద్దె ఎడ్ల కోసం వ్యాపారులకు అడ్వాన్సు ఇచ్చారు.
కరువు కాలంలో పశువులను పోషించడం కష్టంగా మారడంతో రైతులు పశు సంపదను విక్రయించుకున్నారు. అంతేగాక రైతులు ఎడ్లకు బదులుగా యంత్రాలను వినియోగిస్తున్నారు. ఖరీఫ్ లో సాగుచేసే పసుపు పంటకు ఎడ్ల అవసరం ఏర్పడుతుంది. పసుపు విత్తేందుకు ఎడ్లతో దుక్కి దున్నిస్తారు. ఇద్దరు, ముగ్గురు రైతులు కలసి రెండు ఎడ్లను నెల రోజుల కోసం అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా మూడేళ్లుగా సాగుతోంది.
నిబంధనలివే: రెండు ఎడ్లను అద్దెకు తీసుకునే రైతు.. వాటి ధర మార్కెట్లో ఎంత పలుకుతుందో అంత వ్యాపారి వద్ద డబ్బు నిల్వ ఉంచాలి. ఎడ్లకు మేత ఆ రైతే చూసుకోవాలి. వ్యాపారి ఎడ్లను రైతుకు ఎలా అప్పగించాడో అలానే అప్పగించాలి. నెలకు అద్దె రూపంలో ఎడ్ల జతకు రూ.10 వేలు రైతు చెల్లించాలి. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే పసుపు, మొక్కజొన్న విత్తనాలను విత్తడం ప్రారంభిస్తారు.
ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తుండంతో రైతులు ముందుగానే ఎడ్ల కోసం వ్యాపారులకు అడ్వాన్సులు చెల్లిస్తూ బుక్ చేసుకుంటున్నారు. ఎడ్లను పోషించాల్సిన తామే కరువు పరిస్థితుల కారణంగా అమ్ముకున్నామనీ.. ఇపుడు అవసరానికి అద్దెకు ఎడ్లను తీసుకుంటున్నామని, పనితీరాక వాటిని మళ్లీ వ్యాపారికే అప్పగించడం బాధాకరంగా ఉందని రైతులంటున్నారు.