కేంద్రం దృష్టికి ‘అనంత’ సమస్యలు
గుంతకల్లు : జిల్లాలో నెలకొన్న కరువు సమస్యలను ఈనెల 17న సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రైతు విభాగం నేతలతో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విన్నవించనున్నట్లు జిల్లా కార్యదర్శి డి.జగదీష్ తెలిపారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 ఏళ్లలో అనంతపురం జిల్లాలో కనీవినీ ఎరుగనిరీతిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లా అంతటా తాగునీటి ఎద్దడి ఏర్పడి గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. సినీనటుడు బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. పంటలు పండక, తినడానికి తిండి లేక కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు లక్షల మంది రైతులు, వ్యవసాయ కూలీలు వలస బాట పట్టారన్నారు.
వలస వెళ్లిన నల్లమాడ మండలం రెడ్డికుంటపల్లితండాకు చెందిన కూలీ మంగేనాయక్, కళ్యాణదుర్గం మండలం తూర్పుకొడవపల్లికి చెందిన ఎరికల నాగన్నలు మృత్యువాతపడటం బాధాకరమన్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో కరువు పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా కరువు సహాయ నిధిగా రూ. 2700 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం నుంచి కరువు నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వం స్పందించి అనంతపురం జిల్లా నుంచి కేరళకు వలస వెళ్లిన కూలీలకు 25 కిలోల బియ్యం, 6 కిలోల గోదుమలు, గుర్తింపు కార్డులు ఉచితంగా అందజేయడంతోపాటు ఉచిత నివేశ స్థలం ఇవ్వాలని కోరారు. కేరళ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సుధీర్‌ను కోరగా ఇందుకు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ఈ దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈనెల 10న జిల్లా ఉపాధి హామీ కార్యాలయం ఎదుట 24 గంటల పాటు ధర్నా చేపట్టనున్నామన్నారు. ర్యక్రమంలో సీపీఐ గుంతకల్లు నియోజకవర్గ కార్యదర్శి బి.గోవిందు, నాయకులు బి.మహేష్, ఎస్ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు.