మంచునూ ఒడిసిపట్టే ‘గ్రీన్’హౌస్!
వరుణ దేవుడు వ్యూహం మార్చినప్పుడు.. మనమూ అదేపని చేయాలి! కరువు తాండవించే గడ్డు పరిస్థితుల్లో ఎప్పుడో కురిసే వర్షం కోసమే కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ మిన్నకుంటే ఎలా? ఇంకేదైనా నీటి సంపాదన మార్గం అన్వేషించాలి కదా! ఉత్తర ఇథియోపియావాసులు అదే చేశారు. వర్షపు చినుకులనే కాదు, మంచు బిందువులను కూడా ఒడిసిపట్టి సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చుకునే లోకాస్ట్ గ్రీన్‌హౌస్‌ను ఆవిష్కరించారు.
ఉత్తర ఇథియోపియాలోని యూనివర్శిటీ ఆఫ్ గోండర్కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. అందుబాటు ధరలో లభ్యమయ్యే బయోప్లాస్టిక్ షీట్, నీటి తొట్టె, ఆ రెంటినీ కలిపే చిన్న పైపు, కర్రలు ఒకచోట చేరిస్తే ఈ గ్రీన్హౌస్ సిద్ధమవుతుంది. ఈ గ్రీన్హౌస్ పగటి పూట వేడి గాలుల నుంచి, అధిక ఎండవేడి నుంచి మొక్కలకు రక్షణ కల్పిస్తుంది. రాత్రి వేళల్లో మంచు బిందువుల నీటిని బక్కెట్లలోకి ఒడిసిపడుతుంది.
ఇది మామూలుగా చూడ్డానికి పిరమిడ్‌లా ఉంటుంది. బయోప్లాస్టిక్ షీట్‌తో తయారు చేసిన పలకలను దీనికి అమర్చుతారు. వాటికి పైభాగాన కట్టి ఉండే తాళ్లను లాగితే.. ఆ పలకలు వెలుపలి వైపునకు పువ్వులా విచ్చుకుంటాయి. గ్రీన్హౌస్ లోపల ఏర్పాటైన తొట్టె.. దానిపైన గరాటాలోకి వాన చినుకులు లేదా మంచు బిందువులు వచ్చి చేరతాయి. శుద్ధమైన ఈ జలంతో దప్పిక తీర్చుకోవచ్చు. మొక్కలకూ అందించొచ్చు. ఎడారిలో పంటల సాగుకు ఇటువంటి గ్రీన్హౌస్లలో ఉత్తర ఇథియోపియా ప్రభుత్వం రైతులకు శిక్షణ ఇస్తోంది. ఐడియా బాగుంది కదూ..