మోడీ అద్భుతమైన నాయకుడు: నాగమణి
పదే పదే పార్టీలు మారే అలవాటున్న నాయకునిగా పేరొందిన నాగమణి.. ఎన్సీపీకి రాజీనామా చేశారు. దీంతో బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీల కూటమికి మొదటి దెబ్బ తగిలింది. అంతేకాదు, నాగమణి బహిరంగంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతు పలికారు. ఆయన ఇన్నాళ్లూ ఎన్సీపీ బీహార విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతోపాటు ఎన్సీపీ తరఫున జార్ఖండ్లో పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే గడిచిన రెండున్నర నెలలుగా ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. తాను మోడీ నాయకత్వంలో పనిచేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. వాస్తవానికి నాగమణికి బీహార్లో ఒక ఎంపీ టికెట్ ఇప్పించాలని ఎన్సీపీ భావించింది. కానీ ఇప్పుడు కేవలం కేంద్ర మంత్రి తారిఖ్ అన్వర్ ఒక్కరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
బీహార్లో వెనకబడిన వర్గాల తరఫున నిలబడి పోరాడిన నాయకుడు, ఫైర్ బ్రాండ్ లీడర్ జగదేవ్ ప్రసాద్ కుమారుడైన నాగమణి.. ఇప్పటివరకు కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ.. ఇలా పలు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ గూటికి చేరుతున్నారు. తాను ఒక్క నరేంద్ర మోడీ తప్ప సీనియర్ నాయకులు అందరినీ కలిశానని, కాంగ్రెస్తో చేతులు కలపడం తనకెప్పుడూ ఇష్టం లేదని ఆయన చెప్పారు.