మగాళ్లకే బ్రెయిన్ ట్యూమర్లు ఎందుకు వస్తాయి?
సాధారణంగా ఆడవాళ్లకన్నా మగవారికే బ్రెయిన్ ట్యూమర్లు ఎక్కువ వస్తాయి. దీనికి కారణం మగవాళ్లలో క్యాన్సర్ నిరోధక ప్రొటీన్ లోపమేనంటున్నారు శాస్త్రవేత్తలు.
వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో క్యాన్సర్ ను నిరోధించే రిటినో బ్లాస్టోమా ప్రొటీన్ మగవారిలో తక్కువగా ఉంటుందని తేలింది. మగవారి మెదడు కణాల్లో ఈ ప్రోటీన్ తక్కువగా ఉంటుందట. దీని వల్లే వారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట.
ఈ ప్రోటీన్ లేనందున మగపేషంట్ల చికిత్స కూడా అంత ప్రభావాత్మకంగా ఉండదంటున్నారు నిపుణులు. ఆడవారిలో ఈ ప్రోటీన్ ను నిరోధిస్తే వారిలోనూ మెదడు క్యాన్సర్ కలుగుతుందని కూడా వారు కనుగొన్నారు. ఇప్పుడు లింగ భేదాలను కలుగజేసే సెక్స్ హార్మోన్ల పనితీరుకి ఈ ప్రోటీన్ లభ్యతకి మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.