పాకిస్తాన్, అమెరికాలకు జాతీయత లేదు
పట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎల్.నర్సింహారెడ్డి
ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘జాతీయవాదం – భావవ్యక్తీకరణ’పై సదస్సు
హన్మకొండ చౌరస్తా : పాకిస్తాన్, అమెరికాలకు జాతీయత లేనే లేదని, జాతీయత అంటే భారత దేశానిదని పట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని సామా జగన్మోహన్రావు స్మారక భవనంలో శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యం లో ‘జాతీయవాదం – భావ వ్యక్తీకరణ’ అంశంపై సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వళన చేసి సదస్సు ప్రారంభించారు. అనంతరం రావుల కృష్ణ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ వేల ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లు ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తుండటమే మన జాతీయతకు నిదర్శనమన్నారు. ఆయా దేశాల్లో ఎక్కడ చూసినా వేల ఏళ్ల చరిత్రకు నిదర్శనాలు కనబడవని చెప్పారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి సంస్కృతీ సంప్రదాయాలకు కట్టుబడి ఉండటమే మనదేశం గొప్పదనమన్నారు. భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ మరో పదేళ్లు బతికి ఉంటే ప్రపంచాన్ని హిందూయిజంలోకి మార్చేవాడని చెప్పారు. దేశ సంస్కృతిని దెబ్బతీసేందుకు నాటి నుంచి అనేక మంది పనికట్టుకొని విషప్రచారం చేస్తున్నారని చెప్పారు. సుమతి శతకాలు, వందేమాతరం తదితరాలతో దేశభక్తిని, సంస్కృతిని చాటేలా పుస్తకాలను ముద్రించాల్సిన ప్రభుత్వం, 2006లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అర్జున్‌సింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ పేరిట పాఠశాల వి ద్యార్థులకు అందించే పుస్తకాలపై బూతు బొమ్మలు ముద్రించి పంపిణీ చేశారని అన్నారు. ఉపాధ్యాయినులు బోధించలేని దుస్థితిలో ఉండగా నిరసనలు వ్యక్తం కాగా వాటిని పడేశారని అన్నారు. భారత రాజ్యాం గంలో భావ స్వేచ్ఛ ఉందే తప్పా, భావహక్కు లేదన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే వ్యక్తులను దేశద్రోహులుగా గుర్తించి ప్రజలే బుద్దిచెప్పాలన్నారు. దేశంలో 30 లక్షల ఎన్జీఓలు ఉండగా వాటిలో 15లక్షలవి బోగస్ అని మన్మోహన్సింగ్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. వీరసైనికులు ప్రాణా లు తెగించి జాతిని రక్షిస్తుంటే, మరికొందరు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సుఖాలు అనుభవిస్తూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారు. విశిష్ట అతిథిగా హాజరైన కేయూ ప్రొఫెసర్ రంగారావు మాట్లాడుతూ దేశభక్తి, గౌరవం కలిగి ఉండటం ప్రతిపౌరుడి బాధ్యత అన్నా రు. నేటి సమాజంలో దేశాన్ని ఎంత వ్యతిరేకిస్తే అంత మేధావిగా పాపులారిటీ వస్తోందన్నారు. భారత రాజ్యాంగంలో వాక్స్వాతంత్ర్యం ఉందే తప్ప ఇష్టమొచ్చినట్లు మా ట్లాడే హక్కు లేదన్నారు. దేశ రక్షణకు, సం స్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకగా మాట్లాడితే కఠినంగా శిక్షించేలా ప్రభుత్వాలు చట్టాలు సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మేల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, గుజ్జుల నర్సయ్య, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా అద్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, చాడ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.