విభజన.. హైరానా!
అందరి దృష్టి జూన్ 2 పైనే
- తలమునకలవుతున్న ప్రభుత్వం
- ఉద్యోగుల బిల్లులు మినహా తక్కిన పనులన్నీ వాయిదా
- నెలాఖరునే పదవీ విరమణ లబ్ధి
- మొరాయించిన ఆన్లైన్ సర్వర్లు
- జూన్ ఒకటి సహా మే నెల వేతనం బిల్లుల సమర్పణ గడువు పొడిగింపు?
సాక్షి, కర్నూలు: ఉద్యోగుల బదిలీలు.. పదోన్నతులు.. పోస్టింగ్‌లు.. కౌన్సెలింగ్‌లు.. అన్నీ రద్దయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బిల్లులు మినహా మిగిలిన పనులేవీ ఇప్పుడు కాదని తేల్చి చెప్పింది. విభజన నేపథ్యంలో చక్కబెట్టాల్సిన పనులపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికల విధుల నుంచి వచ్చిన ఉద్యోగులు వారి జీతాల బిల్లులు సమర్పించేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు పొడిగించడంతో ఆదివారం కూడా ఖజానా కార్యాలయాలు పనిచేశాయి.
జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు 65వేల పైమాటే. పింఛన్‌దారులు 35వేల మంది ఉన్నారు. అన్ని రకాల ఖర్చులకు ఈ నెల 24వ తేదీ తుది గడువుగా ప్రకటించారు. రాష్ట్ర విభజన జూన్ 2న అమల్లోకి రానుండటంతో ఆ నెల 1వ తేదీకి సంబంధించి ఒక్కరోజు ఉద్యోగుల జీతం బిల్లును కూడా ముందుగానే సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బిల్లుల తయారీకి ఉద్యోగులు హైరానా చెందుతున్నారు.
ఇదిలాఉండగా ఐసీడీఎస్ పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులతో పాటు వివిధ పథకాల కింద విడుదల చేసిన నిధులను కూడా ఒకే పద్దు కింద డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రెండు మూడు రోజుల్లోనే నిధులన్నీ డ్రా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర విభజన అమల్లోకి వస్తే ఆ తర్వాత నిధుల విడుదలకు ఎంత సమయం పడుతుందో తెలియని నేపథ్యంలో ఐసీడీఎస్ పథకాలు నిలిచిపోకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
శాఖల కుదింపు
ప్రస్తుతం ప్రభుత్వ శాఖల విభాగాలన్నీ కలిపి 114 ఉండగా.. వీటిని కుదించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ విభాగాలను సగం కన్నా తక్కువ సంఖ్యలో కుదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ డెరైక్టరేట్లోనూ ఆయా శాఖలను పర్యవేక్షించే సిబ్బందిని కుదించనున్నారు.
ఈ కసరత్తును ఈనెల 24వ తేదీలోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈనెల 24వ తేదీ తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఖర్చును అనమతించరాదని నిర్ణయించారు. ఉద్యోగులు జీపీఎఫ్, కంటింజెంట్, జీతాల బిల్లులు, నెలాఖరుకు పదవీవిరమణ చేసే వారి గ్రాట్యూటీ, ఇతర బిల్లులను ఈ గడువులోగానే సమర్పించాల్సి ఉంది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన బిల్లులను కూడా ఈ గడువులోపే అందజేయాలని ఆదేశించారు.
అందుబాటులోకి రాని సర్వర్లు
విభజన ముంచుకొస్తున్న సమయంలో ఆన్లైన్ మొండికేసింది. శని, ఆదివారం సర్వర్లు మొరాయించగా.. సోమవారం ఉదయం కొంతసేపు పనిచేసినా ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితి కొనసాగింది. ఉద్యోగులు బిల్లులు సమర్పించేందుకు సోమవారం ఆఖరు కావడంతో గందరగోళానికి తావిచ్చింది. సర్వర్లు పని చేయని కారణంగా గడువును 23వ తేదీ వరకు పెంచే అవకాశం ఉన్నట్లు ట్రెజరీ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా విభజన కారణంగా ప్రతి శాఖలోనూ ఉద్యోగులపై ఒత్తిడి అధికమైంది.