అందని.. రుణమాఫీ
సాక్షి, మహబూబ్‌నగర్ : పంట రుణాలమాఫీ ప్రక్రియ ప్రహసనంగా సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రైతుల రుణాలు రీ షెడ్యూల్ కావడం లేదు. ఇప్పటివరకు ఎన్ని మిస్సింగ్ కేసులు అనేది తేలడం లేదు. దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా ఖాతాదారుల లెక్కలు ఇవ్వడానికి బ్యాంకులు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. చాలాచోట్ల రైతులకు సరైన సమాధానం ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయశాఖల మధ్య సమన్వయలోపం కారణంగా రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. రేపో, మాపో రెండోవిడత నిధులు రానున్న నేపథ్యంలో ఇంకా మొదటి విడతనే పూర్తికాకపోవడంతో రైతుల్లో నిరాసక్తత నెలకొంది.
జిల్లాలో 6.07లక్షల మంది రైతులు రూ. 2,096 కోట్ల మేర పంట రుణాల మాఫీకి అర్హులుగా తేల్చారు.
అయితే ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో తొలి విడతల కింద రూ.681.45 కోట్లు బ్యాంకుల ఖాతాల్లో జమచేశారు. ఇప్పటి వరకు 5.25లక్షల మంది రైతులకు రూ.1980కోట్ల మేర రుణాలు రీషెడ్యూలు చేసుకున్నారు. సుమారు 80లక్షల మంది రైతుల రుణాలు రీషెడ్యూల్ కాలేదు. వీరిలో చాలామందికి రుణమాఫీ ప్రక్రియపై రైతులకు అవగాహన లేకపోవడం, కొందరు చనిపోవడం, మరికొందరు వలస వెళ్లడం వంటి కారణాలతో పంట రుణాల రీ షెడ్యూలు జిల్లాలో పూర్తిస్థాయిలో జరగడం లేదు.
కొనసాగుతున్న మిస్సింగ్‌లు...
రుణమాఫీ అర్హత కలిగి ఉండి మిస్సింగ్ అయిన కేసులు ఇంకా కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. ఇంతకాలానికి కూడా కేవలం 20 రోజుల వ్యవధిలో తప్పిపోయిన రుణఖాతాల సంఖ్య 285 వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు దాదాపు మూడు వేలకు పైగా మిస్సింగ్ ఖాతాలు వచ్చాయి. వీటికి రూ.15.03 కోట్ల రుణం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలో ఇంకా 82వేల వరకు రుణాలు రీ షెడ్యూల్ కావాల్సి ఉంది. చాలాచోట్ల అర్హత కలిగిన రైతులకు సైతం రుణమాఫీ కావడం లేదు.
బ్యాంకర్ల సహాయ నిరాకరణతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మిస్సింగ్ కేసులు సకాలంలో గుర్తించి న్యాయం చేయడంలో రెవెన్యూశాఖ కూడా విఫలమవుతోంది. అదేవిధంగా మిస్సింగ్ ఖాతాలకు సకాలంలో డబ్బులు చేరవేయడంలో వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. మూడు శాఖల మధ్య సమన్వయం లేని కారణం చేత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.
తిరిగి తిరిగి అలసిపోయిన: కె.జలంధర్‌రెడ్డి, కరివెన, భూత్పూరు
రుణమాఫీకి అర్హత ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటిదాకా అందలేదు. బ్యాంకు, రెవెన్యూ అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా ఆరు నెలలు తిప్పించుకున్నరు. గట్టిగా అడిగితే మిస్సింగ్ అయ్యిందని చెప్పిండ్రు. న్యాయం చేయాలని వేడుకుంటే లెటర్ పెట్టినమని, త్వరలో పైసలు వస్తాయని చెప్పిండ్రు. ఇది జరగబట్టి మూడు నెలలు. ఇప్పటి దాకా పైసలు రాలేదు.
రుణమాఫీ రాలేదు: ఆలేటి ఎడ్ల మశన్న, రైతు, గట్టురాయిపాకుల
నాగర్‌కర్నూల్ ఎస్బీఐలో పంట రుణం తీసుకున్నా. అధికారులు నా పేరును ఏటీఎల్(అగ్రికల్చర్ టర్మ్ లోన్) జాబితాలోకి చేర్చటం వల్ల రుణమాఫీకి అర్హుడై ఉండి కూడా రుణమాఫీ పొందలేకపోయా. నాలాంటి రైతులు మా ఊర్లో దాదాపు 11మంది దాకా ఉన్నారు. రుణమాఫీకి అర్హులను చేయాలని ఆర్డీఓ వద్దకు, బ్యాంకు అధికారుల వద్దకు, తహశీల్దార్ వద్దకు మూడు నెలలపాటు తిరిగాం. చివరగా అధికారులు రుణమాఫీ ఇవ్వకుండానే మా పంట రుణాన్ని రెన్యూవల్ చేసి అన్యాయం చేశారు.