కీళ్లు కదలకపోతే...
నిర్ధారణ!
కీళ్ల నొప్పులు, కదిలించినప్పుడు టకటకమని విరిగినట్లు శబ్దం రావడం లేదా కిర్రుమని ఒకదానికొకటి రాసుకుంటున్నట్లు శబ్దం రావడం, ఎముకలో వాపు, కీళ్ల దగ్గర నీరు చేరడం, కీళ్ల కదలికలు కష్టంగా అనిపించడం, కీళ్ల దగ్గర కండరం సన్నబడిపోవడం, కీళ్లు బలంగా లేక బరువు మోపడానికి ధైర్యం చాలకపోవడం వంటి లక్షణాలు అన్నీ కానీ, కొన్ని కానీ ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్‌గా గుర్తిస్తారు. ఈ లక్షణాలు కనిపించినప్పటికీ దానిని నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
ఎక్స్‌రే: ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌ను నిర్ధారించడానికి చేసే తొలి పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఎముక ములుకులా ఏర్పడడం, రెండు ఎముకల మధ్య ఖాళీ తగినంత లేక ఎముకలు దగ్గరగా జరగడం, కీళ్లలో క్యాల్షియం నిక్షిప్తమై ఉండడం వంటి ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు.
ఎంఆర్ఐ స్కాన్: దీని పూర్తి పేరు మ్యాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్. ఈ పరీక్ష ద్వారా ఎముకల మధ్య ఉండే కార్టిలేజ్, కండరాలు, ఎముకను కండరాన్ని కలిపే టెండాన్స్ పరిస్థితితోపాటు ఎముకలో వచ్చిన చిన్న పాటి తేడాను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
సాధారణంగా ఏ రకమైన అనారోగ్యమైనా సరే మొదట రక్తపరీక్షను సూచిస్తుంటారు. కానీ ఇందులో రక్తపరీక్ష చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఆస్టియో ఆర్థరైటిస్తోపాటు రక్తహీనత వంటి ఇతర అనారోగ్య లక్షణాలు కూడా ఉన్నప్పుడు రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది.