Minority Rights Day: మైనారిటీలంటే ఎవరు? జాబితాలో ఎవరున్నారు?
భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 18న మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మైనారిటీ కమ్యూనిటీల హక్కులను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. అలాగే ఈరోజు దేశంలోని మైనారిటీల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 2013లో తొలిసారిగా మన దేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.1992, డిసెంబర్ 18న ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో జాతి, మతపరమైన, భాషాపరమైన మైనారిటీలకు ప్రత్యేక హక్కులను ఆమోదించింది. 2013లో భారతదేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మైనారిటీ సమూహాల గుర్తింపు, హక్కులను పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిక్లరేషన్ రాష్ట్రాలను కోరింది.నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ (ఎన్సీఎం)ను 1992లో జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం కింద అధికారికంగా స్థాపించారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలతో పాటు గుర్తింపు పొందిన మైనారిటీ కమ్యూనిటీల రాజ్యాంగ హక్కుల అమలును పర్యవేక్షించడం ఎన్సీఎం లక్ష్యం. 2014లో జైనులను ఈ జాబితాలో చేర్చారు. భారతదేశంలో మైనారిటీల హక్కులను వివిధ రాజ్యాంగ నిబంధనలలో పొందుపరిచారు. ఆర్టికల్ 29, 30 ప్రకారం వారికి హక్కులపై హామీలిచ్చారు. మైనారిటీలకు విద్య, సంస్కృతి, మతం లేదా భాష ఆధారంగా వివక్ష నుండి స్వేచ్ఛను పొందే హక్కులను రాజ్యాంగం కల్పించింది. వీటిని అమలు చేయడానికి, మైనారిటీ వర్గాల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎన్సీఎం పనిచేస్తుంది.ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, పార్సీలు, జైనులను ఎన్సీఎం మైనారిటీలుగా గుర్తిస్తుంది. మైనారిటీ హక్కుల దినోత్సవ ప్రాముఖ్యత విషయానికొస్తే.. మైనారిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించేందుకు, వాటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ఈరోజు(డిసెంబరు 18)న నిర్వహిస్తుంటారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు , సామాజిక న్యాయం కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని మైనారిటీ హక్కుల దినోత్సవం గుర్తు చేస్తుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు