ఫైవ్‌స్టార్ పెట్ క్లినిక్!
మనుషులకేనా ఫైవ్‌స్టార్ క్లినిక్స్? పెట్‌కు అక్కర్లేదా? కావాలి అంటున్నారు ఢిల్లీ వాసులు. వారి కోసం ‘రీనాల్ వెట్’ అనే అతి అధునాతనమైన క్లినిక్ ప్రారంభమైంది. ఇక్కడ శునకాలకు బిపి చెక్ చేయడం, రక్తం శుభ్రం చేయడం, కిడ్నీ వైద్యం, అంతే కాదు డయాలసిస్ కూడా చేస్తున్నారు. అల్లోపతిక్ విధానాల ద్వారా మాత్రమే కాకుండా ‘ఆక్యుపంక్చర్’ విధానంతో కూడా ఇక్కడ వైద్యం చేస్తున్నారు. ‘గవర్నమెంట్ పశువైద్యశాలలో అన్నీ ఉచితంగా చేస్తారు నిజమే కాని వాటి స్థాయి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.. కానీ ఈ హాస్పిటల్లో నమ్మకమైన మంచి వైద్యం దొరుకుతోంది’ అని పెట్ లవర్స్ అంటున్నారు.
పెట్‌డాగ్ అనారోగ్యాన్ని బట్టి ఒక్కో విడతకు ఐదు వేల రూపాయల ఖర్చు అయ్యే వైద్యం కూడా ఇక్కడ చేయించుకుంటున్నారు. పెద్ద పెద్ద హోదాల్లో పేషంట్ల కోసం విదేశీ డాక్టర్లు రావడం మనకు తెలుసు. ఈ క్లినిక్‌లో కూడా మనం కోరితే విదేశీ పశువైద్యులు వచ్చి వైద్యం చేస్తారు. ప్రస్తుతం రీనాల్ వెట్లో ఒక బ్రెజీలియన్ డాక్టర్ కూడా పని చేస్తున్నారు. మనుషులు క్రమంగా మనుషుల తోడును కోల్పోతున్న ఈ ఆధునిక జీవితంలో పెట్డాగ్సే మనిషికి తోడుగా మారుతున్నాయి. వాటి బాగోగుల కోసం మనుషులు ఎంత ఖర్చుకైనా వెనుకాడరనడానికి ఉదాహరణే ఈ ఫైవ్‌స్టార్ పెట్ క్లినిక్.