కొత్త ఎంఈఓలపై ‘అధికార’ పెత్తనం!
అనంతపురం: ‘నాకు తెలీకుండా, మాట కూడా చెప్పకుండా నా నియోజకవర్గంలో ఎలా ఎంఈఓగా చేరతావు. చేరకూడదు అంతే. పొరబాటున చేరితే నీ ఇష్టం...’ ఇదీ ఓ మండల విద్యాశాఖ అధికారికి అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి బెదిరింపు. ఆయన నియోజకవర్గంలో ఇప్పటికే వివిధ శాఖల అధికారులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ఆ ఎంఈఓ అక్కడ చేరే సాహసం చేయలేదు. ఇలా ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో ఎంఈఓలను విధుల్లో చేరకుండా అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. సీనియార్టీ ఆధారంగా ఈ నెల 26న కడపలో కౌన్సెలింగ్ నిర్వహించి ఎంఈఓ
పోస్టులను భర్తీ చేశారు. అయితే గతంలో ఇన్ చార్జ్ ఎంఈఓలుగా పని చేసిన హెచ్ఎంలు కొందరు వారికి అనుకూలంగా ఉండడడంతో తిరిగి వారిని ఎంఈఓ పోస్టులో కూర్చొబెట్టాలని కొత్తవారిని విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్నారు. సీనియార్టీ ఆధారంగా తమను ఎంఈఓ పోస్టుల్లో నియమించారని చెప్పుకున్నా అధికార పార్టీ నాయకులు వినే పరిస్థితుల్లో లేరు. ముదిగుబ్బ, శింగనమల, గాండ్లపెంట, నల్లచెరువు, నల్లమాడ, ఆమడగూరుతో పాటు మరికొన్ని మండలాల్లో విద్యాశాఖ అధికారులు విధుల్లో చేరలేదు. మరోవైపు అధికారులేమో ఆయా ఎంఈఓలపై విధుల్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.