‘బ్యాండ్’తో ఐఏఎస్‌ల కేటాయింపు!
తెలంగాణ, ఏపీ మధ్య పంపకానికి కొత్త విధానం
294 మంది ఐఏఎస్‌ల కేటాయింపు నేడు.. తెలంగాణకే రాజీవ్ శర్మ!
అన్ రిజర్వ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలవారీగా పంపకం
రాష్ట్రంవారిని స్థానికత ఆధారంగా.. రాష్ర్టేతరులను ‘బ్యాండ్’ తో పంపిణీ
నేడు మధ్యాహ్నం ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులో కొత్త విధానం తెరపైకి వచ్చింది. రోస్టర్ విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ నుంచి ఉద్యోగుల కేటాయింపును ప్రారంభించడానికి బదులుగా.. ‘రోస్టర్ బ్యాండ్’ విధానాన్ని అనుసరించనున్నారు. దీని ప్రకారం రెండు మూడు సంవత్సరాల బ్యాండ్లను కలుపుతూ.. ఆయా కేటగిరీల్లో మొదటి అధికారి ఆంధ్రప్రదేశ్‌కు, రెండో అధికారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేలా మార్పు చేసినట్లు సమాచారం. దీనితో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆంధ్రప్రదేశ్‌కు కాకుండా తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 294 మంది ఐఏఎస్ అధికారులు ఉండగా... అందులో 125 మంది బయటి రాష్ట్రం వారు ఉన్నారు. ఇప్పుడు వీరి పంపకమే కీలకం కానుంది. ప్రస్తుతం అనుసరించనున్న ‘బ్యాండ్’ విధానం బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులకు వర్తిస్తుంది. గతంలో మూడు రాష్ట్రాల్లో అధికారుల విభజన జరిగినప్పుడు.. అవశేష రాష్ట్రం (రెసిడ్యూయరీ స్టేట్) నుంచి అధికారుల కేటాయింపు జరిగిందని, ఇప్పుడు అదే విధానం అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
రాష్ర్టేతరులు అయిన 125 మంది ఐఏఎస్ అధికారుల్లో... 82 మంది అన్‌రిజర్వ్, 21 మంది ఓబీసీ, 12 మంది ఎస్సీ, 10 మంది ఎస్టీలు ఉన్నారు. ఇందులో ఒక్కో కేటగిరీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు 10:13 లెక్కన అధికారులను కేటాయిస్తారని.. అంటే ప్రతీ రెండో అధికారిని తెలంగాణకు కేటాయించడమని సీనియర్ అధికారులు తెలి పారు. ఈ లెక్కన రాజీవ్ శర్మ తెలంగాణ రాష్ట్రానికే వస్తారని పేర్కొన్నారు. ఇక నేరుగా రిక్రూట్ అయిన 66 మంది ఐఏఎస్ అధికారుల్లో.. ఆంధ్రా నుంచి 51, తెలంగాణ నుంచి 15 మంది మాత్రమే ఉన్నారు.
వీరిలో ఆంధ్రాకు 37 మంది, తెలంగాణకు 29 మంది రావాల్సి ఉంది. ఈ లెక్కన ఆంధ్రాకు అదనంగా ఉన్న వారిని తెలంగాణకు కేటాయిస్తారు. నేరుగా ఐఏఎస్‌కు ఎంపికైన 66 మంది తెలుగు ఐఏఎస్‌ల్లో... అన్ రిజర్వ్‌లో 38 (ఏపీ 27, తెలంగాణ 11), ఓబీసీలో 9 (ఏపీ 7, తెలంగాణ 2), ఎస్సీల్లో 16 (ఏపీ 14, తెలంగాణ 2), ఎస్టీల్లో ముగ్గురు (అంతా ఏపీ వారే) ఉన్నారు. మరోవైపు పదోన్నతిపై ఐఏఎస్‌లైన అధికారులు 103 మంది ఉన్నారు. ఇందులో ఆంధ్రా ప్రాంతంవారు 52 మంది ఉంటే.. తెలంగాణ అధికారులు 51 మంది ఉన్నారు. వీరిలో నిష్పత్తి ప్రకారం తెలంగాణకు అదనంగా ఉన్న ఆరుగురిని ఏపీకి కేటాయిస్తారని అధికారవర్గాలు వివరించాయి.
నేడు సమావేశం.. మధ్యాహ్నానికి జాబితా!
ప్రత్యూష్ సిన్హా కమిటీ శుక్రవారం ఢిల్లీలో సమావేశమవుతోంది. ఇందులో పాల్గొనడానికి తెలంగాణ ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ ఇప్పటికే ఢిల్లీలో ఉండగా... ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళుతున్నారు. ఈ కమిటీ మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం అవుతుందని... రెండు గంటలలోగా ఐఏఎస్ అధికారుల కేటాయింపు ప్రాథమిక జాబితా బయటకు వస్తుందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు.
రోస్టర్ విధానం అంటే..
ఐఏఎస్ అధికారుల విభజనను జిల్లాల ఆధారంగా 10:13 నిష్పత్తిలో పంపిణీ చేస్తారు. ఈ నిష్పత్తిని 1:1.3గా మార్చుకుంటే... మొదటి అధికారి తెలంగాణకు, రెండో అధికారి ఆంధ్రాకు వస్తారు. అలా కేటాయించిన తరువాత 0.3 పాయింట్లు మిగులుతాయి. ఈ పాయింట్లు రౌండప్‌కు (జీరో లేదా దగ్గరకు వచ్చే అంకె) వచ్చే వరకు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ వెళ్తారు. అలా రౌండప్ తరువాత.. వచ్చే అధికారిని ఆంధ్రాకు కేటాయిస్తారు. ఇది రోస్టర్ విధానం.
రోస్టర్ బ్యాండ్ విధానం..
‘రోస్టర్ బ్యాండ్’ విధానంలో.. ఒక కేటగిరీలోని ఐఏఎస్‌ల సంఖ్యతో తెలంగాణకు కేటాయించే అధికారుల సంఖ్యను భాగిస్తారు. అలా వచ్చిన భాగఫలం అంకె నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఐఏఎస్‌లను కేటాయిస్తారు. ఇలా కేటాయింపును జనరల్, సామాజిక వర్గాల వారీగా చేస్తారు. దీనిలో మొత్తం 12 బ్యాండ్లు ఉంటాయి. ఒక్కో బ్యాండ్‌లో వర్గాల వారీగా రెండు మూడు సంవత్సరాల బ్యాచ్ అధికారులను కలుపుతారు. అలా బ్యాండ్‌లోని అధికారులను కేటాయిస్తూ వెళ్తారు. ఉదాహరణకు 1982-86 బ్యాచ్ ఐఏఎస్ అధికారులను ఒకే చోట కలిపి బ్యాండ్‌గా నిర్ణయించి.. రోస్టర్ విధానాన్ని అమలు చేయడం.