అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు
సాక్షి, బళ్లారి : వందలాది మంది సిబ్బంది, అధికారులు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారాయి. మరో వైపు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో పనుల నిమిత్తం వచ్చే వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బళ్లారి రాయల్ సర్కిల్ సమీపంలో రోడ్డుకు ఇటు వైపున జిల్లాధికారి కార్యాలయం, అటు వైపున తహసీల్దార్ కార్యాలయం ఉంది. జిల్లాధికారి కార్యాలయం ఆవరణలో రెవెన్యూ, సర్వే, ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల ఫోరం, ట్రెజరీ తదితర 16 శాఖల కార్యాలయాలు ఉన్నాయి.
ఆయా శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు నిత్యం వేలాది మంది ఇక్కడకు వస్తుంటారు. సమస్యల పరిష్కారానికి ఆందోళనకారులు నిత్యం ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం చేపడుతుంటారు. ఇంతటి రద్దీ కార్యాలయంలో కనీసం మంచినీరు లభించదు. గతంలో ఇక్కడ రెండు చిన్న హోటల్స్ ఉండేవి. వాటిని తొలగించడంతో గత్యంతరం లేక ప్రజలు రోడ్డుపైకి చేరుకొని దాహం తీర్చుకుంటున్నారు. ఇక ఆహార పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట పరిశుభ్రత మచ్చుకైనా కనిపించదు. జిల్లాధికారి కార్యాలయ ఆవరణ మొత్తం బురదమయమే. వర్షాకాలంలో పరిస్థితి వర్ణాణాతీతం. నీరు నిల్వ ఉంటూ దోమలు స్వైర విహారం చేస్తుంటాయి. దశాబ్దాలుగా ఈ పరిస్థితి నెలకొన్నా పట్టించుకునేవారు లేరు.
తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలోనూ ఇదే తరహా సమస్యలు నెలకొన్నాయి.ఇక్కడ వ్యవవసాయ, ఉద్యానవన, ట్రాఫిక్, రూరల్ తదితర 10 శాఖల ముఖ్య కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా చెత్తా చెదారం పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. వర్షాకాలంలో ఆవరణ బురదమయంగా ఉండటంతో పనులపై వచ్చే రైతులు, నగరప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయాల్లో మంచినీరు తదితర వసుతులు కల్పించడంతోపాటు ఆవరణల్లో అంతర్గత రహదారులు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.