‘కరువు నివారణకు రూ.1,014 కోట్లు ఇవ్వండి’
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో 14 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని కరువు పరిశీలన బృందానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కరువు నివారణ పనుల కోసం రూ.1,014 కోట్లు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్.పి. సిన్హా నేతృత్వంలోని రెండు కరువు పరిశీలన బృందాలు వాస్తవ పరిస్థితుల అధ్యయనం కోసం ఈనెల 23 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పర్యటించాయి.
తమ పరిశీలినలో తేలిన విషయాలను సీఎం క్యాంపు కార్యాలయం ‘కృష్ణా’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కేంద్ర బృందం వివ రించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య వర్షాభావం వల్ల తుమకూరు, కోలార్, చిత్రదుర్గ జిల్లాలో భూగర్భ నీటిమట్టం 1,500 అడుగులకు పడిపోయిందన్నారు. చాలా చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
కరువు నివారణ పనులు చేపట్టడానికి, పంట నష్టపరిహార వితరణకు వీలుగా వెంటనే నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రతినిధి బృందానికి తెలిపానన్నారు. వారు కూడా నిదుల విడుదలకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారన్నారు. కాగా, కరువు పరిస్థితుల అధ్యయనం కోసం కేంద్ర ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించడం ఈ ఏడాది ఇది రెండోసారి.