చౌక గృహాలకు రుణం... లాభం!
ముంబై: చౌక గృహాలకు (రూ.10 లక్షల లోపు) రుణాలను అందించడం బ్యాంకింగ్ రంగానికి లాభదాయకమైన అంశంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ– సిబిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ విభాగంలో గడచిన ఐదేళ్లలో రుణ వృద్ధి రేటు 23 శాతంపైగా ఉందని సిబిల్ పేర్కొంది. ఈ విభాగంలో మొండిబకాయిలు ఒక శాతంగా ఉన్నాయని తెలిపింది. రుణదాతలకు హౌసింగ్ విభాగం పటిష్ట వృద్ధి అవకాశాలను కల్పిస్తోందని తన తాజా అధ్యయన పత్రంలో వివరించింది. ఈ నివేదికలో అంశాలను సిబిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్షలా చందూర్కర్ వివరించారు. ముఖ్యాంశాలు చూస్తే...
2016లో చౌర గృహ రుణ బుక్విలువ రూ.30,400 కోట్లు. రుణ గ్రహీతలు 7.5 లక్షల మంది.మొండిబకాయిల శాతం అతి తక్కువగా ఉండడం రుణదాతకు సానుకూలాంశం.
ఈ విభాగంలో సగటు రుణ పరిమాణం సగటున రూ.4.8 లక్షలు ఉంటే, ఇది ఇప్పుడు దాదాపు రూ.4.1 లక్షలకు చేరింది. సగటు తక్కువగా ఉండడం వల్ల మరిన్ని చిన్న బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు రానున్న సంవత్సరాల్లో ఈ విభాగంలోకి అడుగుపెట్టొచ్చు.
టాప్–5లో ఆంధ్రప్రదేశ్...
చౌక గృహ రుణాలకు సంబంధించి అకౌంట్ల ప్రారంభంలో గడచిన ఐదేళ్లలో టాప్‌లో ఉన్న రాష్ట్రాల్లో– మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ప్రారంభమైన అకౌంట్లలో 60 శాతం వాటా ఈ రాష్ట్రాలదేనని అధ్యయనం తెలిపింది. అకౌంట్ల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో (6.53 లక్షలు) ఉంది. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (5.60 లక్షలు), గుజరాత్ (3.13 లక్షలు), తమిళనాడు (2.65 లక్షలు), ఆంధ్రప్రదేశ్ (2.28 లక్షలు) ఉన్నాయి.