రుణాల్లో మోదీ ‘ముద్ర’
‘ముద్ర’ యోజన ప్రారంభం
రూ. 20,000 కోట్ల కార్పస్ ఫండ్‌తో సేవలు
ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీగా; ఏడాదిలో బ్యాంకుగా
స్వయం ఉపాధి పొందే వారికి రూ.10 లక్షల దాకా రుణాలు
న్యూఢిల్లీ: నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల దాకా రుణాలను సమకూరుస్తుందని ఆయన చెప్పారు. దాదాపు 12 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న 5.75 కోట్ల పైగా లఘు, చిన్న తరహా సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంపై ఇది దృష్టి పెడుతుందన్నారు. పెద్ద సంస్థల్లో కేవలం 1.25 కోట్ల మందే ఉపాధి పొందుతుండగా, చిన్న సంస్థలు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని.. ఇలాంటి వాటికి తోడ్పాటునిచ్చేందుకే ముద్ర పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రధాని చెప్పారు. ప్రధాన మంత్రి ముద్ర యోజనకు రూ. 20,000 కోట్ల కార్పస్ నిధి ఉంటుంది.
ముద్ర విధులివి..
మైక్రో యూనిట్ల అభివృద్ధి, రీఫైనాన్సింగ్ కార్యకలాపాల కోసం చిన్న తరహా వ్యాపారవేత్తలకు రూ. 50,000 రూ. 10 లక్షల దాకా ముద్ర రుణాలు ఇస్తుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు 7 శాతం వడ్డీ రేటుపై రీఫైనాన్స్ సేవలు అందిస్తుంది. తయారీ, సర్వీసులు తదితర రంగాల్లోని చిన్న వ్యాపారులకు రుణాలు కల్పించే సంస్థల మార్గదర్శకాలు రూపొందించడం, ఎంఎఫ్‌ఐల రిజిస్ట్రేషన్, రేటింగ్ మొదలైన అంశాలను ముద్ర పర్యవేక్షిస్తుంది. ఎంఎఫ్ఐ తీసుకునే రిస్కును బట్టి వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ముద్ర నిధి నుంచి తీసుకునే మొత్తాన్ని రుణంగా ఇచ్చేటప్పుడు నిర్దిష్ట వడ్డీ రేటుకు మించి వసూలు చేయకుండా పరిమితి విధిస్తుంది. నాబార్డ్ సీజీఎంలలో ఒకరైన జిజి మెమన్ ముద్రకు సీఈవోగా ఉంటారు.
సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) కూడా ముద్ర నుంచి రుణాలు తీసుకోవచ్చని, తదుపరి ఆ మొత్తాన్ని ఇతరులకు రుణాలిచ్చేందుకు ఉపయోగించుకోవచ్చని ఆర్థిక సర్వీసుల కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఫండింగ్ దశను బట్టి ‘శిశు’, ‘కిశోర్’, ‘తరుణ్’ పేరిట మూడు రకాల పథకాల కింద ముద్ర యోజన నిధులు సమకూర్చుతుంది. రూ. 50,000 దాకా రుణాలు శిశు కింద, అంతకు మించి..రూ. 5 లక్షల దాకా కిశోర్ కింద, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల దాకా రుణాలు తరుణ్ పథకం కింద వర్గీకరించారు.
ఏడాదిలోగా బ్యాంకుగా రూపాంతరం..
రిజర్వ్ బ్యాంక్‌లో ముద్ర ఎన్బీఎఫ్సీ కింద నమోదైంది. రాబోయే 6-12 నెలల కాలంలో దీన్ని బ్యాంకు కింద మార్చేలా చట్టం తేనున్నట్లు అధియా వివరించారు. ముద్ర బ్యాంకు బిల్లును 6-12 నెలల్లోగా పార్లమెంటులో ప్రవేశపెట్టగలమని అధియా చెప్పారు. గత ప్రభుత్వం రూపొందించిన ఎంఎఫ్ఐ బిల్లులోని కొన్ని నిబంధనలు కూడా ఇందులో పొందుపర్చగలమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎంఎఫ్ఐ బిల్లు ఉండబోదన్నారు. చిన్న సంస్థల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)కి ఇది అనుబంధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇటు ఎంఎఫ్ఐ రంగం కూడా అభివృద్ధి చెందేందుకు ముద్ర తోడ్పడగలదని అధియా చెప్పారు. పేద ప్రజల అవసరాలు తీర్చేలా సముచిత వడ్డీ రేటుతో ఇంటి వద్దే రుణం లభించేలా చూసేందుకు మరిన్ని ఎంఎఫ్ఐలు రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు.
బ్రాండింగ్‌పై దృష్టి పెట్టాలి..
చిన్న తరహా సంస్థలు మరింతగా ఎదగాలంటే ప్యాకేజింగ్, బ్రాండింగ్, అడ్వర్టైజింగ్పై ప్రధానంగా దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. తద్వారా చిన్న సంస్థలు దేశీ ఎకానమీ మూలాలు మరింత పటిష్టమయ్యేందుకు తోడ్పడగలవన్నారు. ‘ఉదాహరణకు మామిడి పళ్ల రైతు.. కేవలం మామిడిని అమ్మితే కొంత మొత్తమే వస్తుంది. అదే.. పచ్చళ్లు చేసి అమ్మితే మరింత ఎక్కువొస్తుంది. ఆ పచ్చడినే మరింత ఆకర్షణీయంగా మంచి సీసాలో ప్యాక్ చేస్తే మరింత ఎక్కువ వస్తుంది. ఒక అమ్మాయితో ఆ పచ్చళ్ల ప్రకటనలు రూపొందిస్తే ఇంకాస్త లభిస్తుంది’ అని ఆయన వివరించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. గాలిపటాలు తయారు చేసే ముస్లింలను ప్రోత్సహించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కొద్ది పాటి ఊతంతో గాలిపటాల వ్యాపారం రూ.35 కోట్ల నుంచి 500 కోట్లకు పెరిగిందన్నారు. చిత్తశుద్ధి పేదలకు పెట్టని ఆభరణమని, వారికి ముద్ర తోడైతే వురింత ఎదగగలరని ప్రధాని చెప్పారు.