ఫలితాల్లో నీరసించిన హెచ్డీఐఎల్
ముంబై: రియల్టీ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్డీఐఎల్) కు ఈ సం.రం ఆర్థిక ఫలితాల్లో ఎదురు దెబ్బ తగిలింది. క్యూ2లో నికర లాభం భారీగా క్షీణతను నమోదు చేసి నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. 36 శాతం క్షీణించి రూ. 37 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇది రూ. 57 కోట్లు. నిర్వహణ ఆదాయం 8 శాతం తగ్గి రూ. 218.54 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది జులై క్వార్టర్ లో ఇది 237 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం 223 కోట్లను సాధించినట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో సంస్థ తెలిపింది. గత ఏడాది మొత్తం ఆదాయం రూ.243కోట్లుగా నిలిచింది. అలాగే స్టాండెలోన్ ప్రాతిపదికన నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 31 శాతం తగ్గి రూ. 110 కోట్లను తాకగా, ఇబిటా మార్జిన్లు 67.7 శాతం నుంచి 50.5 శాతానికి మందగించాయి. హెచ్డీఐఎల్ షేరు 0.73 శాతం నష్టంతో రూ.61.35 వద్ద ముగిసింది.