బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఫారిన్ రిలేటెడ్ అక్రమాల కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పై రూ .5 కోట్లు జరిమానా విధించింది. బీఓబీ బీఎస్ఈకిచ్చిన నోటీసులో ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్లో వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై విచారించిన ఆర్బీఐ విచారణ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. తనపై నగదు డిపాజిట్లు, బదిలీల వివరాలను ఫైనాన్స్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) సమర్పించిన లావాదేవీలను పర్యవేక్షించిన ఆర్బీఐ విదేశీ చెల్లింపులు జరిగినట్టు నిర్ధారించిందనీ, తాము విచారణకు పూర్తిగా సహకరించామని తెలిపింది. ఆర్బీఐ సూచనల మేరకు తమ ఈ లోపాలను సరిచేసుకోవడానికి అవసరమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది.
కాగా ఈ బ్యాంకుకు చెందిన అశోక్ విహార్ బ్రాంచ్ లో బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి 59 కరెంట్ ఖాతా హోల్డర్స్ , 33 ఖాతాలకు సంబంధించిన నగదు డిపాజిట్లు, బదిలీల వివరాలను ఫైనాన్స్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కి తెలిపినట్టు బీఓబీ ఉన్నతాధికారులు గతంలో వెల్లడించారు. ఈ అక్రమ లావాదేవీల్లో తమ ప్రమేయం లేదని బ్యాంకు అంతర్గత ఆడిటింగ్ లో ఈ వివరాలు తెలియడంతో సీబీఐ, ఈడీలకు తామే సమాచారం ఇచ్చామని బీఓబీ చెప్పింది. దీనిపై విచారించిన సీబీఐ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన వివిధ శాఖల ద్వారా విదేశాలకు తరలించారని సీబీఐ వెల్లడించింది సుమారు రూ.6000 కోట్ల అక్రమాలు జరిగాయని, వీటిలో ఎక్కువగ భాగం తరలింపులు హాంగ్ కాంగ్ కు జరిగినట్టు ఈ ఏడాది మార్చిలో సీబీఐ నివేదించిన సంగతి తెలిసిందే.