కర్నూలులో ఆర్టీసీకి రూ.1.58కోట్ల ఆదాయం
ఆత్మకూరు (కర్నూలు) : సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా నుంచి వివిధ పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడపడం వల్ల రూ. 1.58 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆత్మకూరులోని ఆర్టీసీ డిపో డీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా నుంచి 100 ప్రత్యేక బస్సులు నడిపినట్లు తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ. 44కోట్లకు నష్టాన్ని తగ్గించగలిగినట్లు చెప్పారు.
2013-14 ఇదే కాలంలో రూ. 63 కోట్ల నష్టం వచ్చిందన్నారు. అయితే సింగిల్, డబుల్ స్టాప్ సర్వీసులను నడపడం, ఇతర సమయాలలో ప్రత్యేక సర్వీసులను తిప్పుతూ లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తక్కువ ఆదాయం వచ్చిన సర్వీసులను రద్దు చేసి ఎక్కువ ప్రయాణికులు వెళ్లే రూట్లలో నడుపుతున్నామని చెప్పారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, కృష్ణా పుష్కరాలలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.