గోదాముల నిర్మాణానికి రూ.972.78 కోట్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో గోదాముల నిర్మాణానికి రూ.972.78 కోట్ల రుణం మంజూరు చేసేందుకు నాబార్డు అంగీకరించిన నేపథ్యంలో 330 గోదాముల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన ఆమోదం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెటింగ్ విభాగం ప్రతిపాదనల మేరకు నాబార్డు వేర్‌హౌజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రుణ వితరణ కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 330 చోట్ల 17.075 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ద్యం వున్న గోదాములు నిర్మించనున్నారు.
2014-15లో నాబార్డు వేర్‌హౌజింగ్ స్కీం కింద 1037 ప్రాంతాల్లో 12.6 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో గోదాములు నిర్మిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ , సహకార శాఖలు సంయుక్త ప్రతిపాదనలు అందజేశాయి. అయితే తాము రుణం తిరిగి చెల్లించే పరిస్థితిలో లేమంటూ సహకార శాఖ చివరి నిముషంలో ప్రతిపాదనలను విరమించుకుంది. దీంతో గతంలో పంపిన ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం తిరిగి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి నాబార్డుకు సమర్పించింది. రుణ మంజూరుకు నాబార్డు అంగీకరించడంతో ప్రభుత్వం నూతన గోదాముల నిర్మాణానికి తాజాగా పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.