జానకీపురం ఎన్‌కౌంటర్‌పై ఆర్డీఓ విచారణ
మిర్యాలగూడ
మోత్కూర్ మండలం జానకీపురం వద్ద ఏప్రిల్ 4వ తేదీన సిమి ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పులపై మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మిర్యాలగూడ ఆర్డీఓ బి.కిషన్‌రావు విచారణ నిర్వహించారు. విచారణకు ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన ఎస్ఐ సిద్ధయ్య భార్య ధరినీష, ఆయన సోదరులు దస్తగిరి, పెద్ద పాష, దస్తయ్య, గాంధీ మెడికల్ ప్రొఫెసర్ తఖియొద్ధీన్, ఎన్కౌంటర్లో మృతిచెందిన సిమి ఉగ్రవాది ఎజాజుద్ధీన్ తండ్రి అజాజుద్ధీన్, మోత్కుర్ ఎస్ఐ పురుందర్‌బట్ హాజరు కావల్సి ఉంది.
అయితే మోత్కూర్ ఎస్ఐ మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. మోత్కూర్ మండలం జానకిపురం వద్ద పోలీసులు - సిమి ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనపై మొత్తం 43 మందిని విచారణ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆరుగురు మినహా అందరినీ విచారించినట్లు ఆర్డీఓ తెలిపారు. ఏడుగురిలో ఆరుగురు హాజరు కాకపోవడంతో విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.