అధ్వాన్న రోడ్లతో ఇబ్బందులు
త్రిపురారం : మండలంలోని రూప్లాతండ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రహదారిపై గుంతలు పడి మురుగు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రహదారి మధ్యలో పెద్ద గుంటలు ఏర్పడి, అందులో వర్షపు నీరు నిలిచి పెద్ద మడుగులా మారింది. దీంతో ఏ వాహనం వెళ్లాలన్నా ఆ మడుగులోంచి వెళ్లాల్సి వస్తోంది. గుంతలో వర్షపు నీరు నిండడంతో రోడ్డు కనిపించడం లేదని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రహదారిపై ఏర్పడిన గుంతల్లో మట్టి పోయకపోవడం కారణంగా వర్షపునీరుకు తోడు మురుగునీరు గుంతల్లో నిలిచి తీవ్ర అసౌకర్యంగా మారింది. అదే విధంగా రహదారికి ఇరుపక్కల మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి ఉంటుంది. దీంతో ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలను పూడ్చాలని తండావాసులు కోరుతున్నారు.