ఉన్నత విద్య మరింత చేరువ
= రాష్ట్రంలో కొత్తగా 15 వర్శిటీలు
= 20 మాదిరి డిగ్రీ , పాలిటెక్నిక్ కళాశాలలు
= ఇకపై ఉన్నత విద్యకు బడ్జెట్లో అధిక నిధులు
= ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉన్నత విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో కొత్తగా 15 విశ్వ విద్యాలయాలు, 20 మాదిరి డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే తెలిపారు. గురువారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రాథమిక, మాధ్యమిక విద్యాభివృద్ధికి సర్వ శిక్షణ అభియాన్, జాతీయ మాధ్యమిక శిక్షణ అభియాన్ల మాదిరే 12, 13 పంచవర్ష ప్రణాళికల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉన్నత శిక్షణ అభియాన్‌ను ప్రవేశ పెట్టిందని చెప్పా రు.
తద్వారా ఉన్నత విద్యకు అవసరమైన ప్రాథమిక సదుపాయాల కల్పన, పరిశోధనలు, నాణ్యతతో కూడిన విద్యను అందించడానికి వీలవుతుందని వివరించారు. ఈ పథకంలోని నియమావళి ప్రకారం ఒక విశ్వ విద్యాలయం పరిధిలో వంద కళాశాలలు మాత్రమే ఉండాలని తెలిపారు. రాష్ర్టంలో 3,300 కళాశాలలు ఉన్నందున మరో 15 విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు అవకాశం కలుగుతుందని వివరించారు. 12వ పంచ వర్ష ప్రణాళికలో కేంద్రం దీనికి రూ.23 వేల కోట్లు కేటాయించిందన్నారు. 13వ పంచ వర్ష ప్రణాళికలో రూ.10 లక్షల కోట్లు కేటాయించనుందని వెల్లడించారు. ఇందులో రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు లభించనుందన్నారు.
ఈ పథకంలో కేంద్రం వాటా 65 శాతం కాగా రాష్ట్రం వాటా 35 శాతమని, కనుక ఇకమీదట బడ్జెట్లో ఉన్నత విద్యకు ఎక్కువ మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుందని వెల్లడించారు. 20 మాదిరి డిగ్రీ కళాశాలలకు కేంద్రం రూ.12 కోట్లు చొప్పున అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం యూజీసీ గ్రాంటుతో రాష్ర్టంలో ఒకే మాదిరి డిగ్రీ కళాశాల ఉందన్నారు. పాలిటెక్నిక్‌లను కూడా రూ.12 కోట్ల చొప్పున ఖర్చుతో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
పాత పాలిటెక్నిక్‌ల స్థాయి పెంపునకు రూ.2 కోట్లు చొప్పున గ్రాంటు లభించనుందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలు, ఎయిడెడ్ కళాశాలలు, స్వయంప్రతిపత్తి కళాశాలల్లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు ఎక్కువ మొత్తంలో నిధులు లభిస్తాయని తెలిపారు. అయితే ఈ గ్రాంట్లు పొందడానికి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుంచి సర్టిఫికెట్ అవసరమని ఆయన చెప్పారు.