మెడికల్ పరీక్షకు వెళ్లే అమ్మాయిలూ.. బీ అలర్ట్!
హైదరాబాద్: మరో గంటలో తెలంగాణలో ఎంసెట్ మెడికల్ పరీక్షకు హాజరుకానున్న అమ్మాయిలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు వారిని కాస్తంత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పరీక్ష కేంద్రాలన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకే పరిమితం కావడం.. అక్కడికి పూర్తి స్థాయిలో రవాణాసౌకర్యాలు తగిన సమయంలో అందుబాటులో లేని కారణంగా ఉదయం ప్రారంభమైన ఎంసెట్ పరీక్షకు చాలా మంది విద్యార్థులు హాజరుకాలేకపోయారు.
నిమిషం నుంచి అరనిమిషం ఆలస్యం అయినా.. ఏ ఒక్కరినీ పరీక్ష హాలులోకి అనుమతించకుండా వెనక్కి తిప్పిపంపడంతో ఎంతో మంది తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం పరీక్షకు హాజరుకానున్న ఎంసెట్ మెడికల్ విద్యార్థులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు అదనంగా అమ్మాయిలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పరీక్ష హాలులోకి రైటింగ్ ప్యాడ్స్.. గడియారాలు, బంగారు ఆభరణాలు కూడా అనుమతించడం లేదన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అవి ఉన్నాయనే కారణంతో పరీక్ష సమయానికి కేంద్రాలకు వెళ్లినా లోపలికి అనుమతించకపోయే అవకాశం ఉంది.
ఆ సమయంలో తోడుగా తల్లిదండ్రులు ఉంటే ఆభరణాలు వారికి ఇచ్చి వెళ్లే అవకాశం ఉంటుంది కానీ.. ఒంటిరిగా వెళ్లే వారైతే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందువల్ల ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించి చెవిపోగులు, చైన్స్ తదితర బంగారు ఆభరణాలు, వాచెస్, రైటింగ్ ప్యాడ్స్ లేకుండా వెళితేనే ఉత్తమం. తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న వైద్యవిద్య, వ్యవసాయ పరీక్ష (ఎంసెట్ మెడికల్) కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఎస్ కోడ్ ప్రశ్నపత్రాన్ని ఇప్పటికే ఎంపికచేశారు. ఈ పరీక్షకు 1,01,005 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతుంది.