లెక్చరర్‌పై యాసిడ్ దాడి కేసులో..
తిరుపతి క్రైం : కాలూరు క్రాస్ వద్ద గత నెల 15న పీలేరులోని ప్రభుత్వ కళాశాలలో హిందీ లెక్చరర్‌గా పని చేస్తున్న ఎస్.జరీనాబేగంపై యాసిడ్ దాడికి పాల్పడిన ఆమె మాజీ భర్త, అతని స్నేహితున్ని శుక్రవారం ఎంఆర్ పల్లి పోలీసులు ఆర్టీసీ బస్టాండులో అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్‌జెట్టి ఎదుట నిందితుల్ని హాజరు పర్చారు. అర్బన్ ఎస్పీ వివరాలు వెల్లడించారు. 2011లో జరీనాబేగం, తాటి తోపు సమీపంలో నివాసముంటున్న ఖాజా హుస్సేన్‌కు వివాహమైంది. వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో 2014లో విడాకులు(తలాక్) తీసుకున్నారు.
అప్పటి నుం చి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే మాజీ భర్త అయిన ఖాజా హుస్సేన్ ఈమెపై హత్యానికి పాల్పడుతూ లైంగికంగా వేధించేవాడు. దీంతో అతనిపై పీలేరులో 3, చంద్రగిరి ఈస్టు, వెస్టు పోలీసు స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె పై పగ పెంచుకున్న అతను, తన స్నేహితుడు రియాజ్‌తో కలిసి గత నెల 15న బైక్‌పై కాలూరు క్రాస్ వద్ద మాటువేసి, విధులు ముగించుకుని వస్తూ బస్సు దిగిన జరీనాబేగంపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు.
తీవ్ర గాయాలు పాలైన ఆమెకు ఓ కన్ను చూపు కోల్పోయిందని, ఇలాంటి దాడులకు ఎవరైనా పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఎస్పీ అన్నారు. మహిళలు ఈ విధమైన సమస్యలు ఎదుర్కొంటుంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, వాటిని అరికడతామని సూచించారు. నిందితులపై హత్యాయత్నం, మహిళా రక్షణ చట్టాలకు సంబంధించిన కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల్ని పట్టుకున్న డీఎస్సీ శ్రీనివాసులు, సీఐ మధు, ఎస్ఐ ఆదినారాయణను ఎస్పీ అభినందించారు.