తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం
ముషీరాబాద్: కృషి, పట్టుదల, లక్ష్యం ఉంటే జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చని హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎస్.సృజన నిరూపించింది. ప్రపంచంలోని పది ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుంచి నేత్ర వైద్యంలో డాక్టరేట్ పట్టా పొందిన సృజన ప్రస్తుతం కెరటోకోనస్పై డాక్టరేట్ అనంతర విశిష్ట పరిశోధన కొనసాగిస్తున్నారు. ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపక దంపతులైన ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ భారతిల కుమార్తె.
ఇప్పటికే అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందిన సృజన నిర్విరామ సామాజిక సేవ-నేత్ర చైతన్య కృషి’కి గుర్తింపుగా ఆస్ట్రేలియాలోని నేత్ర పరిశోధనా కేంద్రం సెరా (సెంటర్ ఫర్ ఐ రీసెర్చ్ ఆస్ట్రేలియా) వారు డాక్టర్ సృజనకు ప్రతిష్టాత్మకమైన సెరా-2016 అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. సెరా ద్విదశాబ్థి ఉత్సవాల సందర్భంగా గురువారం జరిగిన వేడుక వేదికపై ఆమెకు ఈ అరుదైన అవార్డును బహూకరించారు.