కాల్పుల కలకలం.. లొంగిపోయిన మాతాజీ!
పెళ్లి వేడుకలో కాల్పులు జరిపి పరారయిన మాతా సాధ్వి దేవ ఠాకూర్ కర్నల్ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. శుక్రవారం పోలీసు స్టేషన్కు వచ్చిన ఆమె తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. అధికారుల కథనం ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లి తంతు జరగుతుంటే తుపాకీతో గాల్లోకి సరదాగా కాల్పులు జరుపుతారు. ఈ వారం మొదట్లో హర్యానాలోని కర్నల్ జిల్లాలో సావిత్రి లాన్స్ అనే కళ్యాణ మండపంలో ఓ వివాహం జరిగింది. అందులో పాల్గొన్న సాధ్వి దేవతో పాటు ఆమె అనుచరులు తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మేనత్త చనిపోగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
కాల్పులు జరిపిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరినీ హత్యచేయలేదని.. తనతో పాటు మరికొందరు కాల్పులు జరిపారని పోలీసులకు శుక్రవారం ఆమె తెలిపారు. తాను కాల్పులు జరపగా, ఏ ఒక్కరు గాయపడలేదని చెప్పారు. వాస్తవానికి పోలీసులకు లభ్యమైన వీడియోలో మరో వ్యక్తి కూడా గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధ్వి దేవ జరిపిన కాల్పుల వల్లే వరుడి మేనత్త చనిపోవడంతో ఆమె పరారయిందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కర్నాల్ పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.