టైటిల్ మారిన సాహసం
సాహసం చిత్రం పేరు ఇప్పుడు సాగహం ఎండ్ర వీరచ్చయల్‌గా మారింది. ప్రశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సాహసం.ఆస్ట్రేలియా బ్యూటీ అమండా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని స్టార్ మూవీస్ పతాకంపై త్యాగరాజన్ భారీ ఎత్తున నిర్మించారు. నవ దర్శకుడు అరుణ్రాజ్వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాజర్, తంబిరామయ్య, ఎంఎస్.భాస్కర్, జాన్‌విజయ్, దేవదర్శిని, లిమాబాబు ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ క్రేజీ నటి నర్గిస్ఫక్రి ప్రత్యేక పాటలో ప్రశాంత్‌తో ఆడి పాడిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించిన జులాయి చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం.అయితే దీన్ని కాన్సెప్ట్ మారకుండా చిన్న చిన్న మార్పులతో మళ్లీ తెలుగులో విడుదల చేయనున్నట్లు నిర్మాత త్యాగరాజన్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించడం విశేషం.
కారణం ప్రశాంత్‌కు తెలుగులో మంచి ఆదరణ ఉండడమే అని చెప్పవచ్చు. ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన చిత్రం గీతాలు ఇప్పటకే యూట్యూబ్‌లో విడుదలై హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి మొదట సాహసం అని పేరును నిర్ణయించారు. అయితే ఇప్పుడు దాన్ని సాగసం ఎండ్ర వీరచ్చెయల్ అని మార్చినట్లు నిర్మాత వెల్లడించారు. సాహసం అన్నది తమిళ భాషకు చెందిన వాక్యం కాదని ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం ఉండదనే కారణంగానే చిత్రం పేరును మార్చినట్లు త్యాగరాజన్ వివరించారు. సాగహం ఎండ్ర వీరచ్చెయల్ చిత్ర విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొంది ఈ నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేయనుంది. నటుడు ప్రశాంత్ తదుపరి హిందీ చిత్రం స్పెషల్ 26 రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.