సందిగ్ధంలో సాగర్ రైతాంగం
►ఒక పంటకైనా నీళ్లు విడుదల చేయాలని డిమాండ్
►541.10 అడుగులకు చేరిన సాగర్ నీటి మట్టం
మాచర్లటౌన్: సాగర్ నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కుడికాలువ రైతులు సందిగ్ధంలో పడ్డారు. జలాశయ నీటి మట్టం కనిష్ట స్థాయిని మించి 30 అడుగులు వుండడంతో ఒక పంటకైనా అవకాశం కల్పించాలని రైతాంగం కోరుతోంది.
►పది రోజుల కిందట తాగు నీటి అవసరాల కోసం ప్రభుత్వం కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసింది. ప్రతి రోజు ఆరు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
►గురువారం నాటికి సాగర్ జలాశయ నీటిమట్టం 541.10 అడుగు లకు చేరింది. అంటేఇది కనిష్ట స్థాయి కన్నా 30 అడుగులు ఎక్కువ. నీటి మట్టం 510 అడుగుల వరకు మాత్రమే ఉంటే కాలువలకు నీరు విడుదల చేసే అవకాశం ఉండదు.
►ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 75 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ రోజురోజుకు కొద్ది కొద్దిగా పెరుగుతోంది.
►ఓ వైపున శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద నీరు నిలిచిపోవటంతో జలాశయ నీటిమట్టం గురువారం 875.70 అడుగుల వద్ద ఉంది. ఇది 167 టీఎంసీలకు సమానం.
►సాగర్ రిజర్వాయర్‌లో కూడా 188 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగు నీటి విడుదల నిమిత్తం కుడి కాలువకు 6,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 5,108 క్యూసెక్కులు, కృష్ణాడెల్టాకు సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,158 క్యూసెక్కులు, శ్రీశైలం ఎడమ గట్టు కాలువకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
►సాగర్ నుంచి ఔట్‌ఫ్లోగా 17,266 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా 75 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వల దృష్ట్యా సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఒక పంటకు నీటిని విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.
►ప్రస్తుతానికి వర్షాలు లేక కృష్ణాపరివాహక ప్రాంతంలో ఇన్‌ఫ్లో నిలిచి పోయినా రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉండటం, సెప్టెంబరు నెలలో వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు నీటి విడుదలపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
►ప్రస్తుతం ఉన్న నిల్వలతో చెరువులు నింపడంతోపాటు, ఒక పంటకు నీళ్లు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికైనా నీటి విడుదల పై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి వుంది.