అప్పుడు భార్యను .. ఇప్పుడు బిడ్డలను..
దొడ్డబళ్లాపురం : కన్న తండ్రే బిడ్డలను చంపడానికి వచ్చిన సంఘటన దేవనహళ్లి తాలూకా యలియూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం భార్యను చంపేశాడు. ఇప్పుడు కూమారులను చంపడానికి ప్రయత్నించిన నిందితుడిని గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. శిడ్లఘట్ట తాలూకా సంతెకల్లహళ్లికి చెందిన శ్రీనాథ్(35) కన్నబిడ్డలను కడతేర్చడానికి ప్రయత్నించిన తండ్రి. 10 సంవత్సరాల క్రితం శ్రీనాథ్ ప్రభావతిని వివాహం చేసుకున్నాడు.
నాటి నుంచి శ్రీనాథ్ భార్యను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేసేవాడు. రెండేళ్ల క్రితం భార్యను హత్య చేసి శ్రీనాథ్ జైలుపాలయ్యాడు. అప్పటికే వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఆ పిల్లలను ప్రభావతి తల్లితండ్రులు తీసికెళ్లి పోషిస్తున్నారు. రెండు రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన శ్రీనాథ్ మంగళవారం ఉదయం తప్పతాగి కత్తితీసుకుని తన ఇద్దరు పిల్లలను హత్య చేయడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న చెన్నరాయపట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి కూడా శ్రీనాథ్ పిల్లలను చంపేస్తానంటూ సైకోలా ప్రవర్తించాడు. అతి కష్టంమీద పోలీసులు శ్రీనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.