సిద్ధకవుల భక్తిగీతాలు.... లల్ల వచనాలు... శివరాత్రి జన్మాంతర జ్ఞాపకాలు...
సంలీనం
మహా శివరాత్రి, శివుడూ, శివరాత్రీ నాలో జన్మాంతర జ్ఞాపకాలతో పాటు ఇంతదాకా బతికిన బతుకులో కూడా అత్యంత విలువైన క్షణాల్ని మేల్కొలుపుతాయి. మా ఊళ్లో మాకొక చిన్న నారింజతోట ఉండేది. అందులో నిమ్మ, నారింజ, టేకు మొక్కల్తో పాటు రెండు మూడు మారేడు మొక్కలు కూడా ఉండేవి. మారేడు మొక్కల్ని చూడగానే మా నాన్నగారెంతో పరవశించిపోయేవారు. ఆయన పేరు విశ్వేశ్వర వెంకట చలపతి. మా తాతగారు కాలినడకన మూడుసార్లు కాశీరామేశ్వర యాత్ర చేసిన లోక సంచారి. పిల్లలకి పెట్టుకున్న పేర్లన్నీ శివసంబంధాలే. మా నాన్నగారిని అంతా విశ్వనాథం అనే పిలిచేవారు. ‘శంభో శంకర సాంబ సదాశివ శాంతానంద మహేశ శివ/ ఢంఢం ఢమరుక ధరణీ నిశ్చల డుంఠి వినాయక సేవ్య శివ’ అని చప్పట్లు చరుస్తూ ఇల్లంతా తిరుగుతూ ఆయన పాడే ఆ కీర్తనతో నా బాల్యమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ పాటని మా తాతగారు మధురై నుంచి మోసుకొచ్చారు. ఆయన మధురై వెళ్లినప్పుడు అక్కడి మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఎవరో భక్తసమూహం కోలాటమాడుతూ ఆ పాట పాడారుట.
పెద్దవాణ్ణయ్యాక శివకవులూ, శివక్షేత్రాలూ మరింతగా పెనవేసుకోవడం మొదలయ్యాక బహుశా ఈ జీవితంలో నిజమైన ప్రశాంతి పొందినది శివస్మరణకు నోచుకున్న క్షణాల్లోనేననిపిస్తుంది.
యజుర్వేదాంతర్గత రుద్రాధ్యాయం, ఋగ్వేదంలోని రుద్రసూక్తాలు, కుమార సంభవం, శివపురాణం వంటి సంస్కృత వాఙ్మయంతో పాటు, ప్రాచీన తమిళ సాహిత్యంలోని తిరుమురుగుపాడై, తిరుమూలార్ రచించిన తిరుమంతిరం, అరవై ముగ్గురు నాయన్మారుల శివసంకీర్తానా సర్వస్వం, సిద్ధకవుల భక్తిగీతాలు, నాథ కవులు, పెరియ పురాణం, కన్నడ వచన కవులు, పాల్కురికి సోమన్న, శ్రీనాథుడు, ధూర్జటి, కాశ్మీరు శివాద్వైత కవులు, అభినవ గుప్తుడి పరమార్థసారం, లల్ల వచనాలు, శివ, భక్తి తంత్ర వాఙ్మయం... శివభక్తిభాండారానికి అంతం లేదు. అయినా అందరికన్నా నన్ను గాఢంగా హృదయానికి హత్తుకునే శివ కవిత్వం మాణిక్య వాచకర్తో కలిపి నలువురుగా చెప్పబడే అప్పర్, జ్ఞానసుందర్, సుందరర్ కవిత్వం. ‘తేవారం’గా ప్రసిద్ధ చెందిన వారి కవిత్వాన్నీ, మాణిక్య వాచకర్ రాసిన తిరువాచకాన్ని చదవడానికైనా తమిళం నేర్చుకోవాలనిపిస్తుంది.
భక్తి ప్రకటన స్వభావరీత్యా అయిదు రకాలు. దాస్య, వాత్సల్య, సఖ్య, శాంత, మధుర. కన్నడ వచనకవుల్లో అల్లమప్రభునిది శాంతభక్తి. బెజ్జ మహాదేవిది వాత్సల్యభక్తి. బసవన్నది సఖ్యభక్తి. అక్కమహాదేవిది గాఢాను గాఢమైన మధురభక్తి. తక్కిన వచనకవులందరిదీ దాస్యభక్తి. మహారాష్ట్ర భక్తికవుల్లో జ్ఞానేశ్వర్ది మధురభక్తి. తుకారాముడిది సఖ్యభక్తి. హిందీ భక్తి కవుల్లో సూర్దాస్ది వాత్సల్యభక్తి. మీరాది మధురభక్తి.
నాకున్న కలల్లో ఒక అందమైన కల ఇలా ఉంటుంది: నేను శ్రీకాళహస్తి నుంచి ఒక యాత్ర మొదలుపెడతాను. పాండ్యనాడు పొడుగునా అప్పర్ స్తుతించిన శివాలయాల్నీ, కావేరీ నదికి ఉత్తర దక్షిణాల్లో విస్తరించిన చోళనాడులో సంబంధులు గానం చేసిన ప్రాచీన తమిళ గ్రామసీమల్నీ, తొండైనాడులో సుందరమూర్తి ప్రణయం కోసం దేవుడు మధ్యవర్తిత్వం చేసిన దేవాలయాల్నీ, అక్కడ పొగడ చెట్లనీ, పున్నాగ చెట్లనీ చూస్తూ యాత్ర చేస్తాను. నాతోపాటు కొన్ని స్కెచ్బుక్కులు కూడా ఉంటాయి. అందులో చార్కోల్తోనో పెన్సిల్తోనో ఆ దేవాలయ దృశ్యాల్నీ ఆ తమిళ గ్రామాల్నీ, ఆ చెరువుల్నీ, ఆ కలువల్నీ, ఆ వరిచేలనీ, ఆ కొబ్బరితోటల్నీ బొమ్మలు గీసుకుంటాను... నిజంగా, ఈ జన్మలో ఈ కల నిజమైతే.
- వాడ్రేవు చినవీరభద్రుడు