ప్రపంచ శాంతి కోసం ప్రార్థన
ద్యాత్మిక శాంతిని పొందడానికి, ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని బైబిల్ మిషన్ మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె.శామ్యూల్ కిరణ్ అన్నారు. దైవజనులు ఎం.దేవదాస్ అయ్యగారికి బయలుపరిచిన 76వ బైబిల్ మిషన్ మహోత్సవాలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్ కిరణ్ మాట్లాడుతూ మహోత్సవాల ఆశీర్వాదాలను తమతో పాటు పొరుగువారికి కూడా అందించాలని సూచించారు. ప్రతి భక్తుడు దే వుని కృపకు పాత్రులై జీవించాలన్నారు. కుల,మత, వర్గ, ప్రాంత విభేదాలు లేకుండా ఒకే పందిరిలో ఇంతమంది ఐక్యతానురాగాలతో మూడు రోజుల పండుగ వాతావరణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. మహోత్సవాలు విజయవంతం కావడానికి తోడ్పాటు నందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మండల పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో వేసిన పందిళ్లలో గత మూడు రోజులుగా జరిగిన మహోత్సవాలకు దేశ, విదేశాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. చివరిరోజు తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతికి చెందిన డాక్టర్ డేనియల్ దినకర్ ధ్యాన ప్రార్థనలతో దినచర్యలు ప్రారంభించారు. ఒరిస్సా, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక సంఘాలకు చెందిన రెవరెండ్లు కె.శ్యాంకిషోర్, సీఎస్ఐ బిషప్, జి. దైవాశీర్వాదం, సైమన్ హక్ వాక్యోపదేశం చేశారు. పందిళ్ల ప్రాంగణం భక్త జన సంద్రంలా మారింది. బైబిల్ మిషన్ మహోత్సవాల నివేదికను వివరించారు.
ప్రముఖుల రాక : బైబిల్ మిషన్ మహోత్సవాల ముగింపురోజు బుధవారం పలువురు ప్రముఖులు హాజరై దేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు -1 ఎమ్మెల్మే షేక్ మస్తాన్ వలి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు, యూత్ గాస్పెల్ టీమ్ సభ్యులు, రెవరెండ్లు, యాజకులు,సేవకులు పాల్గొనగా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎన్.సత్యానందం, కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్ కిరణ్, సెక్రటరీ రెవరెండ్ పీఎం శాంతిరాజు, జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎన్.యేసురత్నం, స్త్రీల సభల కన్వీనర్ డాక్టర్ ప్రమీలా సెల్వరాజ్ దేవుని నామమున అతిథులకు ఆశీర్వచనాలు అందజేశారు.కాకాని తోటలో పోటెత్తిన భక్తులు: పెదకాకాని తోటలో మూడు రోజులుగా భక్తులు పోటెత్తారు. బైబిల్ మిషన్ మహోత్సవాలకు హాజరైన భక్తులు పెదకాకాని తోటకు చేరుకుని తోట ప్రాంగణంలో ఉన్న ఎం.దేవదాసు అయ్యగారికి, రెవరెండ్ డాక్టర్ జె.జాన్ సెల్వరాజ్ మహిమ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆకట్టుకున్న ప్రమీలా సెల్వరాజ్ బృందం భక్తిగీతాలు
దివ్య దేవుడు దీవించును గాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, క్రీస్తు ప్రభువు రక్షించునుగాక అంటూ తమ మధురమైన స్వరంతో దైవ భక్తిగీతాలను స్త్రీల సభల కన్వీనర్ డాక్టర్ జె.ప్రమీల సెల్వరాజ్, రీనా శామ్యేల్ బృందం ఆలపించారు. బైబిల్ మిషన్ మహాసభల అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ ఎన్. సత్యానందం అధ్యక్షత వహించి వాక్యోపదేశం చేశారు. సెక్రటరీ రెవరెండ్ పీఎం శాంతిరాజు పాపాలు ఒప్పుదల, బాప్తిస్మములు, అన్నప్రాస, నామకరణలు చేయగా జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఎన్.యేసురత్నం విశ్వాస ప్రమాణం, ముగింపు ప్రార్థన చే శారు.
ప్రత్యేక ఏర్పాట్లు
మూడు రోజుల పాటు మహోత్సవాలకు హాజరైన భక్తులు పండుగను జరుపుకుని, తిరిగి వారి గృహాలకు దేవుని దీవెనలతో అందుకుని ఆనందంతో వెనుదిరిగారు. ఆర్టీసి, రైల్వే శాఖ అధికారులు భక్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గుంటూరు, మంగళగిరి డిపోలకు చెందిన ఆర్టీసీ సర్వీసులను బైబిల్ మిషన్ మహోత్సవాల ప్రాంగణానికి మళ్లించారు. రైల్వే అధికారులు సమీపంలోని నాగార్జున నగర్ వద్ద తాత్కాలిక రైల్వే హాల్ట్ ఏర్పాటు చేసి రైళ్లను నడిపించారు.