మార్క్‌ఫెడ్ తెరిచారు
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: స్థానిక మార్కెట్ యార్డులో నాలుగురోజులుగా మూతపడి ఉన్న మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని అధికారులు బుధవారం తెరిచారు. అంతేకాదు కొనుగోళ్లు కూడా ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రానికి తాళాలు వేసిన సంఘటనపై ‘సాక్షి’ బుధవారం ‘మూసేశారు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన యంత్రాగం ఉరుకుల పరుగుల మీద కేంద్రాన్ని తెరిచేలా ఏర్పాట్లు చేసింది. స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావుకూడా సాక్షి కథనంపై తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆయన జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ నాగమల్లికకు ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. సిద్దిపేట ప్రాంత రైతాంగ శ్రేయస్సు దృష్ట్యా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడం సరికాదన్నారు. వెంటనే మర్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డీఎంకు సూచించారు.
మరోవైపు స్థానిక మార్కెట్ కమిటీ, ఐకేపీ అధికారులతో మాట్లాడి వారిని మందలించారు. జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక కొనుగోలు కేంద్రం మూసివేసిన అంశంపై క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు. హమాలీలకు బకాయిగా ఉన్న రూ. లక్ష రెండు రోజుల్లోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వెళ్లడించారు. దీంతో స్థానిక మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య హమాలీ నాయకులతో మాట్లాడి బుధవారం తూకాలు, ఎగుమతుల ప్రక్రియను పునఃప్రారంభించారు. బుధవారం మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులంతా ఆనంద ం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించేందుకు ‘సాక్షి’ చూపిన చొరవను వారంతా అభినందించారు.