దళారులకు చెక్..స్వయంగా పంట అమ్మకాలు
ఆదర్శంగా రైతు రాంరెడ్డి
జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల మండలం లక్ష్మిపూర్‌కు చెందిన ఆదర్శ రైతు సంగెపు రాంరెడ్డి వరి, మెుక్కజొన్న సాగుచేసేవాడు. ఏళ్లతరబడి ఈ పంటలు సాగుచేసినా పెద్దగా గిట్టుబాటు కాలేదు. దీంతో మార్కెట్ డిమాండ్‌ను పసిVý.ట్టి.. తొటి రైతుల కంటే మూడు నెలల ముందుగానే మొక్కజొన్నను సాగు చేశాడు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పచ్చి కంకులను దళారులకు కట్టబెట్టకుండా స్వయంగా విక్రయిస్తూ లాభాలు పొందుతున్నాడు.
కొద్దిపాటి నీటితో..
సంగెపు రాంరెడ్డి తన వ్యవసాయ బావిలో ఉన్న కొద్దిపాటి నీటితో మే నెలలో ఎకరం భూమిలో మెుక్కజొన్న సాగును ప్రారంభించాడు. భూమిని మూడు సార్లు ట్రాక్టర్‌తో దున్నించి, స్వయంగా తయారు చేసిన వర్మి కంపోస్టుతో పాటు, డీఏపీని భూమిలో వేశాడు. బావిలో నీటిని జాగ్రత్తగా పంటకు అందిస్తూ కాపాడుకున్నాడు. జూన్‌లో వర్షాలు కురియడంతో పంట జల్లు దశకు చేరుకుంది. ఈ దశలో పంటకు మరోసారి యూరియాను చల్లాడు. దీంతో, పంట ఏపుగా పెరిగి, గింజ దశకు చేరింది. కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు 20 రోజులు అక్కడే కాపలా ఉన్నాడు. ఫలితంగా మెుక్కజొన్న పంట మంచి దిగుబడినిచ్చింది.
స్వయంగా అమ్మకం..
పంట చేతికి రాగానే రాంరెడ్డి జగిత్యాలలో దళారులను సంప్రదించాడు. రూపాయికి రెండు కంకులు ఇవ్వాలని వారు అన్నారు. పంట సాగుకు రూ.15 వేలు పెట్టబడి కాగా దళారులకు అమ్మితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని స్వయంగా తానే పచ్చి కంకులను విక్రయించడానికి సిద్ధపడ్డాడు. ట్రాక్టర్లో కంకులను జగిత్యాలకు తీసుకువచ్చి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఈ సీజన్లో కంకులకు మంచి డిమాండ్ ఉండటంతో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రూ.10కి మూడు నుంచి నాలుగు రూ. 20కి ఆరు నుంచి ఏడు కంకులను రాంరెడ్డి విక్రయిస్తున్నాడు.
రైతులు స్వయంగా అమ్మాలి... రాంరెడ్డి. రైతు
రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మితే నష్టపోవాల్సి వస్తుంది. రైతులు స్వయంగా పంటలను విక్రయిస్తే లాభాలు పొందవచ్చు. తాజాగా ఉన్నవాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడుతారు. ధరలు కూడా చెల్లిస్తారు. రైతులందరూ ఈ దశగా ప్రయత్నాలు చేయాలి.