Sanitation services
-
శుభ్రం.. సుందరం
సాక్షి, అమరావతి : పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యర్థాల సేకరణ మెరుగుపడి పట్టణాలు పరిశుభ్రంగా మారడానికి దోహదపడింది. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని రెండేళ్ల కిందట విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 4,097 చెత్త సేకరణ వాహనాలను కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు అందించారు. క్లాప్ కార్యక్రమంలో భాగంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా క్లాప్ కార్యక్రమంపై ప్రత్యేక కథనం.. నిర్వహణకు సిబ్బంది నియామకం... పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. గతంలో చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాల్లో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ‘క్లాప్’లో భాగంగా ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బందిని నియమిస్తున్నారు. కొత్తగా 4,171 ‘చెత్త నుంచి çసంపద’ కేంద్రాలను నిర్మించే దిశగా అడుగులు వేశారు. గ్రామాల్లో మూడు చక్రాల వాహనాల పంపిణీ క్లాప్ కార్యక్రమంలో భాగంగా చెత్త రవాణా కోసం గ్రామ పంచాయతీలకు 14 వేల మూడు చక్రాల వాహనాలు పంపిణీ చేశారు. చెత్త సేకరణ–రవాణాను మరింత మెరుగుపరిచేందుకు వెయ్యి ఆటోలు సమకూర్చారు. వ్యర్థాలను తగిన ఉష్ణోగ్రతల వద్ద భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలను కూడా పంపిణీ చేశారు. ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు కేటాయించారు. దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్లు అందించారు. అదేవిధంగా 135 మేజర్ పంచాయతీల్లో సమగ్ర ద్రవ వ్యర్థాల నిర్వహణకు, 10,645 పంచాయతీల్లో వర్మి కంపోస్ట్ నిర్వహణకు, నాన్ రీసైక్లింగ్ వ్యర్థాలను సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు, సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. వీటన్నింటి ఫలితంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం నెరవేరుతోంది. ఈ కార్యక్రమం విజయవంతమై మన పరిసరాలు, పర్యావరణం పరిశుభ్రంగా ఉండేందుకు దోహదపడింది. 1.20 కోట్ల డస్ట్ బిన్ల పంపిణీ క్లాప్ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్కిన్స్, సూదులు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్ వస్తువులు) చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్లు చొప్పున మున్సిపాలిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్ బిన్లు అందజేసింది. ఇందుకు రూ.100 కోట్ల నిధులను వినియోగించింది. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించింది. మరింత మెరుగ్గా చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్ ఆటోలను సైతం సమకూర్చింది. అదేవిధంగా ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 231 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్(జీటీఎస్)లు ఏర్పాటు చేయడంతోపాటు 72 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల కోసం ఏజెన్సీల ఖరారుకు చర్యలు తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన 32 మున్సిపాలిటీల్లోని డంప్ సైట్లలో వ్యర్థాల నిర్మూలనకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎఫ్ఎస్టీపీ) ఏర్పాటు చేయనున్నారు. -
ఆసుపత్రుల్లో పారిశుధ్యం బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య సేవలు బంద్ అయ్యాయి. పారిశుధ్య కార్మికులకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వారంతా సేవలు నిలిపేశారు. జీతాలు చెల్లించేంత వరకు సేవలు నిలిపేస్తామని చెప్పారు. నాలుగైదు రోజుల కింద నుంచి సేవలు నిలిపేస్తున్నా అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో మంగళవారం నుంచి నిరవధికంగా సేవలను నిలిపివేయాల ని నిర్ణయించినట్లు పారిశుధ్య కార్మికులు తెలిపారు. పారిశుధ్య కార్మికులే కాకుండా పేషెంట్ కేర్, సెక్యూరిటీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో అస్పత్రులన్నీ మందుల వ్యర్థాలతో నిండిపోయాయి. రూ.25 కోట్లు చెల్లించాలి.. రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రులతో పాటు, మెడికల్ కాలేజీల్లో దాదాపు 10 వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వారందరికీ దాదాపు రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారంతా సేవలు బంద్ చేశారు. ఎక్కడికక్కడ ఆస్పత్రుల ఎదుట ఆందోళన చేపట్టారు. వీరంతా ఓ ఏజెన్సీ సంస్థ పరిధిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గతేడాది నుంచి ఈ సంస్థ తమకు ప్రతి నెలా నిర్ణీత సమయానికి జీతాలివ్వట్లేదని సిబ్బంది వాపోతున్నారు. కాగా, పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లిం చని మాట వాస్తవమేనని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి అంగీకరించారు. తాము నిధులు విడుదల చేశామని, బుధవారం కార్మికులకు అందుతాయని పేర్కొన్నారు. -
పారిశుద్ధ్యానికి ‘టెండర్’!
నరసన్నపేట, న్యూస్‌లైన్: సర్కారు ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను కేంద్రీకృతం చేసి రాష్ట్రస్థాయిలో ఒకే సంస్థ కు కట్టబెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు రూపొందించిన కొత్త విధానం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటి మాదిరిగా జిల్లా యూనిట్‌గానే ఖరారు చేయాలని పలు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను రాష్ట్రస్థాయిలో ఒక్కరికే అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు టెండర్లు కూడా ఆహ్వానించింది. ఏపీ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ సెంటర్లు, జిల్లా, డివిజన్ స్థాయి ఆస్పత్రుల్లో ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థలు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నాయి. గతంలో ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా ఉండే వి. రోగులు, వారితోపాటు వచ్చే సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనితో పాటు పారిశుద్ధ్య పనివారి వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలు ఆర్థిక భారంతో కూడుకున్నవి కావడంతో ఈ మొత్తం బాధ్యతను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా సంస్థలను ఖరారు చేస్తున్నారు. దాంతో ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం కాస్త మెరుగుపడింది. ఈ విధానంలో అవకతవకలకు ఆస్కారం ఉందని గుర్తించి, పారిశుద్ధ్య సేవలకు ముందుకు వచ్చే సంస్థల గత చరిత్రను పరిశీలించిన తర్వాత రెన్యువల్ పద్ధతిలో ప్రతి ఏటా వారికే అప్పగిస్తున్నారు. అయితే ఇటీవల అధికారులు కొత్త విధానం రూపొందించారు. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకే సంస్థకు పారిశుద్ధ్య సేవల కాంట్రాక్టు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటన కూడా జారీ చేశారని తెలిసింది. ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోగులు వ్యతిరేకిస్తున్నారు. ఒకే సంస్థకు అప్పగించడం వల్ల మొక్కుబడి సేవలే అందుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం ఏర్పడి ఆశించిన ఫలితం రాదని అంటున్నారు. అంతేకాక ప్రస్తుతం సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానికేతర సమస్య ఉత్పన్నం కావడంతోపాటు అవినీతి అక్రమాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందువల్ల ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పునరాలోచించి జిల్లాలవారీగా పారిశుద్ధ్య టెండర్లు నిర్వహించాలని కోరుతున్నారు.