రెండో పెళ్లిని ఆపిన ఈ-మెయిల్
చెన్నై: విదేశాల్లో ఉన్న భార్యను మోసపుచ్చి రెండోపెళ్లికి సిద్ధమైన భర్తను ఆమె ఈ- మెయిల్ ద్వారా అడ్డుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో చోటుచేసుకుంది. శ్రీలంకకు చెందిన శాంతివాసన్ (33) కెనడాలోని ఒక ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న శ్రీలంకకు చెందిన సీతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తిరుచ్చిలో ఉన్న మాజీ ప్రేయసిని పెళ్లి చేసుకుంటానని భర్త, ఎలా చేసుకుంటావో చూస్తానంటూ భార్య సవాళ్లు విసురుకున్నారు.
కెనడా నుంచి ఇటీవల తిరుచ్చికి వచ్చిన శాంతివాసన్... సంఘమి(26)ని ఈనెల 4వ తేదీన రిజిష్టరు వివాహం చేసుకున్నాడు. అనంతరం ఈ నెల 9వ తేదీన సంప్రదాయ రీతిలో పెళ్లి చేసేందుకు వధువు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కెనడాలోని శాంతివాసన్ భార్య సీత ఈ మెయిల్ ద్వారా తిరుచ్చి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కమిషనర్ కంటోన్మెంటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో విచారణ చేపట్టారు. సీత తాను సహజీవనం చేశామని, తమకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు శాంతివాసన్ అంగీకరించడంతో పోలీసులు పెళ్లిని ఆపేశారు.