ప్రాణం తీసిన దరఖాస్తు
* సంక్షేమ దరఖాస్తుల సమర్పణకు అష్టకష్టాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పొందడం దేవుడెరుగు.. దరఖాస్తుల సమర్పణే గగనంగా మారింది. లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేసుకోడానికి అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం దరఖాస్తు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. పింఛన్ రాకపోతే బతకడమే భారమవుతుందన్న ఆందోళనతో ఎలాగైనా దరఖాస్తులు అందజేయాలని తిప్పలు పడుతున్నారు.
రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దరఖాస్తుల సమర్పణకు గడువు ముగుస్తోందన్న ఆందోళనలో మంగళవారం నగరంలోని కేంద్రాల వద్దకు వచ్చిన ఓ అభాగ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. సైదాబాద్ మండల పరిధిలోని స్వామి వివేకానంద స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన సపోటాబాగ్‌కు చెందిన ఆజమ్‌ఖాన్(65) క్యూలోనే స్పృహ తప్పి పడిపోయి మృతి చెందాడు.
మరోవైపు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చి వెళ్తూ నగర శివారులో మరో వృద్ధుడు కూడా మృతి చెందాడు. అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని ఇంటికి వెళ్తున్న మచ్చబొల్లారానికి చెందిన కొరివి శంకర్(70) రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. అధికారుల అనాలోచిత చర్యలే ఇందుకు కారణమయ్యాయి. ఒకేసారి లక్షల సంఖ్యలో లబ్ధిదారులు పోటెత్తడంతో దరఖాస్తు కేంద్రాల వద్ద గందరగోళం నెలకొంది. కొత్త వారితో పాటు పాత వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
తెల్లవారుజాము నుంచే బారులు తీరుతూ జనం గంటల తరబడి వేచి ఉంటున్నారు. దరఖాస్తు కేంద్రాలు విశాలంగా లేకపోవడంతో కిక్కిరిసిన జనంతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. కనీసం మంచినీరు కూడా లభించక అనేక మంది సొమ్మసిల్లి పడిపోతున్నారు. అధికారులు ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో ఈ ప్రక్రియ అస్తవ్యస్థంగా తయారైంది. హైదరాబాద్‌లో సుమారు 8 లక్షల దరఖాస్తులు రావచ్చని అంచనా. అయితే అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
దర ఖాస్తుల సమర్పణకు జనం పోటెత్తుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోలేకపోయారు. మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ కోసం కౌంటర్లు తక్కువగా ఉండటం, తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల భారీ క్యూలు తప్పడం లేదు. తోపులాట, తొక్కిసిలాటతో వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. పలు కేంద్రాల వద్ద సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగుతున్నారు.
ఆహార భద్రతా కార్డులకు భారీ స్పందన
ఆహార భద్రతకార్డులకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. రేషన్ సరుకులందించే ఈ కార్డుల కోసం ఈ నెల 10 నుంచి గ్రామ స్థాయిలో వీఆర్వోలు, మండలాల్లో ఎంఆర్వోలకు అందిన దరఖాస్తుల సంఖ్య మంగళవారం సాయంత్రానికి 70 లక్షలకు చేరిందని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఒక్క రోజే 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
గడువు పెంపు
ఆహార భద్రతా కార్డులు, పెన్షన్లు, కుల, ఆదాయ, నివాస ధృవ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును 15వ తేదీ నుంచి 20వ తేదీకి ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలు భారీ సంఖ్యలో ముందుకు వస్తున్న నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించాలని ఆయన నిర్ణయించారు.
వృద్ధులు, వికలాంగులు రావద్దు
దరఖాస్తులను సమర్పించేందుకు వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కేంద్రాల వద్దకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ద్వారా దరఖాస్తులను పంపవచ్చని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముకేశ్‌కుమార్ మీనా పేర్కొన్నారు. తెల్లకాగితంపై వివరాలు రాసి సంతకం చేసి పంపిస్తే సరిపోతుందన్నారు.