కంప్యూటర్ విద్య... అంతా మిథ్య
నారాయణఖేడ్: కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. సర్కార్ స్కూళ్లలోని విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యనందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య మూన్నాళ్ల ముచ్చటగా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్లు కొన్నప్పటికీ వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పేవారు లేక అవన్నీ మూలనపడ్డాయి.
సక్సెస్ చేద్దామని...
2008 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశ పెట్టింది. దీంతో అధికారులు లక్షల రూపాయలు వెచ్చించారు. కరెంటు సరఫరా లేని పాఠశాలలకు జనరేటర్ సౌకర్యం కూడా కల్పించారు. అయితే కంప్యూటర్ విద్యను నేర్పే బాధ్యతను మాత్రం ప్రైవేటు సంస్థకు అప్పగించారు. జిల్లాలో కంప్యూటర్ విద్య బోధన బాధ్యతలను ఎన్ఐఐటీ సంస్థకు ఐదేళ్ల పాటు కాంట్రాక్టు ఇచ్చారు. 2008లో ప్రాంభమైన కాంట్రాక్టు 2013 సెప్టెంబర్‌లో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం కాంట్రాక్టు పొడిగించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో సంస్థ సిబ్బంది కంప్యూటర్ విద్యను షట్ డౌన్ చేశారు. కంప్యూటర్ విద్యను నేర్పేందుకు నియమించిన టీచర్లను తొలగించారు. అప్పటి నుంచి జిల్లాలోని 198 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఆగిపోయింది. కంప్యూటర్లు మూలన పడ్డాయి. దీంతో ఆయా పాఠశాలల్లో పనిచేసే 396 మంది కంప్యూటర్ టీచర్లు నిరుద్యోగులుగా మారారు.
ప్రతి పాఠశాలకూ 11 కంప్యూటర్లు
కంప్యూటర్ విద్య కోసం సక్సెస్ పాఠశాలలుగా ఉన్న ఉన్నత పాఠశాలలకు 11 కంప్యూటర్లను అందించారు. దీంతో పాటు కంప్యూటర్లు విద్యుత్ సరఫరా లేకున్నా నడిచేందుకు పాఠశాలకు ఒక్కో జనరేటర్‌ను అందించారు. విద్యార్థులు కంప్యూటర్ విద్యను అందించేందుకు పాఠశాలకు ఇద్దరు టీచర్లను ఎన్ఐఐటీ సంస్థ నియమించింది. వారికి నెలకు రూ.2300 వేతనంగా అందించేది. 2013 సెప్టెంబర్‌లో ఎన్ఐఐటీ సంస్థ కాంట్రాక్ట్ ముగియడంతో అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందడంలేదు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ 2014 -15 విద్యా సంవత్సరం ప్రారంభమై ముడు నెలలు గడుస్తున్నా కంప్యూటర్ విద్యపై స్పందించడం లేదు. ఇప్పటికైన ఉన్నత లక్ష్యాలతో ప్రారంభించిన కంప్యూటర్ విద్యను ప్రభుత్వం కొనసాగించేలా సత్వర చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జోగిపేట ఉప విద్యాధికారి పోమ్యానాయక్‌ను వివరణ కోరగా సక్సెస్ పాఠశాలల్లో ప్రస్తుత ఏడాది కంప్యూటర్ విద్య పూర్తి స్థాయిలో కొనసాగడం లేదని తెలిపారు.