మతమేదైనా సత్యం, శాంతినే బోధిస్తాయి
జయపురం: హిందూ, క్రిస్టియన్, సిక్కు, ముస్లిం ఇలా ఏ మతమైనా సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే బోధిస్తాయని సత్యసాయి సేవాసమితి వారు చెప్పారు. సత్య సాయి సేవాసమితి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బాల వికాస కేంద్రం విద్యార్థులతో వాక్ ఫర్ వాల్యూస్ అనే అవగాహన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భారత మాత, గాంధీ, వివేకానందుడు, బుద్ధుడు, నెహ్రూ, మోడీ వేషధారణలతో ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ ర్యాలీ జయపురం మహాత్మా గాంధీ రోడ్‌లోని సత్యసాయి సేవా సమితి మందిరం నుంచి ప్రధాన మార్గం మీదుగా పోలీస్‌స్టేషన్ వరకూ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ‘ప్లీజ్ ప్రామిస్ అజ్ ఫర్ బెటర్ వరల్డ్’ అనే సందేశాన్ని పోలీసు అధికారులకు సమర్పించారు. సంఘీభావం సర్వ మానవ సమానత్వం, అన్ని మతాలు ఒకటేనన్న సందేశం, వసుధైక కుటుం బంపై విద్యార్థులు అవగాహన కలిగించారు.
ర్యాలీలో సత్యసాయి సేవా సమతి కోఆర్డినేటర్ ఎస్.ప్రకాశ్‌రావు, జిల్లా కోఆర్డినేటర్ మార్కం డేయ షరాఫ్, బాల వికాస్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ ఎస్.స్వర్ణలత, బాల వికాస్ ఉపాధ్యాయరాలు ఎస్.గౌరి, బాల వికాస్ కేంద్ర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.