కొత్త సరుకు
లావా ఐరిస్ ఎక్స్1
దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐరిస్ ఎక్స్1 పేరుతో కిట్‌క్యాట్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అమెజాన్ షాపింగ్ పోర్టల్ ద్వారా లభిస్తున్న ఎక్స్1 ధర దాదాపు రూ.7999. రెండు జీఎస్ఎం సిమ్‌లను సపోర్ట్ చేసే ఎక్స్1 స్క్రీన్ సైజు దాదాపు 4.5 అంగుళాలు. స్క్రీన్ రెజల్యూషన్ 480 బై 854గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.2 గిగాహెర్ట్జ్ వేగంతో పనిచేసే బ్రాడ్‌కామ్ బీసీఎం 23550 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ప్రధాన కెమెరా రెండు ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉంటుంది. రెజల్యూషన్ 8 మెగాపిక్సెల్స్. వీడియోకాలింగ్ కోసం రెండు ఎంపీల కెమెరా ఉంటుంది. ఒక జీబీ ర్యామ్, నాలుగు జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎస్డీ కార్డు ద్వారా 32జీబీకి పెంచుకోవచ్చు) ఉంటుంది. త్రీజీతోపాటు వైఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్/ఎడ్జ్, ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ స్మార్ట్‌ఫోన్‌లో తాజా ఓఎస్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌ను ఉపయోగించారు.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఎంగేజ్...
మైక్రోమ్యాక్స్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కాన్వాస్ ఎంగేజ్ను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా మాత్రమే కొనుక్కోగల ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ.6199 మాత్రమే కావడం గమనార్హం. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌ను ఉపయోగించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయెల్ సిమ్, డ్యుయెల్ స్టాండ్‌బై ఫీచర్లు కూడా ఉన్నాయి. స్క్రీన్ సైజు నాలుగు అంగుళాలు మాత్రమే. క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (1.2 గిగాహెర్ట్జ్) ఉన్నప్పటికీ ర్యామ్ మాత్రం 512 ఎంబీ మాత్రమే ఉండటం కొంచెం నిరాశపరిచే అంశం. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 5 ఎంపీ కాగా, వీడియోకాలింగ్ కెమెరా రెజల్యూషన్ 0.3 మెగాపిక్సెల్స్. బ్యాటరీ సామర్థ్యం 1500 ఎంఏహెచ్. ఈ బ్యాటరీతో 5.5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, గెటిట్, ఒపేరా మినీ, ఎంలైవ్, హైక్, ఎంఐగేమ్స్, గేమ్స్క్లబ్, రివెరై ఫోన్‌బుక్, స్మార్ట్‌ప్యాడ్ వంటి సాఫ్ట్వేర్లు దీంట్లో ప్రీలోడెడ్.
గెలాక్సీ ఎస్4 వాల్యూ ఎడిషన్...
శామ్సంగ్ తాజాగా కిట్‌క్యాట్‌తో నడిచే గెలాక్సీ ఎస్4 వాల్యూ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి దీన్ని ఆన్లైన్ స్టోర్ ద్వారా నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ధర దాదాపు రూ.31,700. అయిదు అంగుళాల ఫుల్హెచ్డీ స్క్రీన్‌తో వచ్చే ఎస్4 వాల్యూ ఎడిషన్‌లో శక్తిమంతమైన 1.9 గిగాహెర్ట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ మైక్రోప్రాసెసర్‌ను ఉపయోగించారు. రెండు గిగాబైట్ల ర్యామ్, 15 జీబీల ఇంటర్నల్ మెమరీ దీని సొంతం. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 మెగాపిక్సెళ్లు. వీడియో కాలింగ్ కెమెరా రెజల్యూషన్ 2 ఎంపీ. బ్యాటరీ సామర్థ్యం 2600 ఎంఏహెచ్.